
- చింతగట్టు నుంచి పలివేల్పుల వరకు ఆగని ఆక్రమణలు
- సరైన రక్షణ లేక తరచూ ఎన్క్రోచ్మెంట్స్
- అన్యాక్రాంతమైన రూ.కోట్లు విలువైన స్థలం
- లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ భూములకు రక్షణ కరువైంది. కెనాల్ చుట్టూ హద్దులు, సరైన రక్షణ లేకపోవడంతో తరచూ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది దర్జాగా కబ్జా చేసి బిల్డింగులు నిర్మిస్తుండగా, ఇంకొందరు కాంపౌండ్లు కట్టి ఎస్సారెస్పీ భూములను తమ వశం చేసుకుంటున్నారు. ఇలా ఇప్పటికే వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం కాగా, వాటి రక్షణకు చర్యలు చేపట్టాల్సిన ఇరిగేషన్ ఆఫీసర్లు కుర్చీల్లోంచి కదలడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బఫర్ జోన్ లోనే నిర్మాణాలు..
ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం 1980లో సర్కారు భూమితోపాటు కొంతమంది రైతుల భూములు సేకరించి కెనాల్స్ నిర్మించింది. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం భీమారం శివారులో 193 మంది రైతుల నుంచి దాదాపు 99.39 ఎకరాల భూసేకరణ చేపట్టింది. అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రూ.92 లక్షల వరకు పరిహారం చెల్లించి, కాల్వను నిర్మించింది.
ఇదిలాఉంటే సాధారణంగా 10 మీటర్లకంటే ఎక్కువ విస్తీర్ణం ఉండే కెనాళ్లకు 9 మీటర్లు మేర బఫర్ జోన్ ఉండాలి. 10 మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉండేవాటికి 2 మీటర్లుండాలి. దాని ప్రకారమే గతంలో ఆఫీసర్లు హద్దులు నిర్ణయించినా కాలక్రమేణా ఆక్రమణలు జరిగి, కాల్వకు రెండు వైపులా కబ్జాలు పుట్టుకొచ్చాయి.
25 కి.మీలు.. వందల కోట్ల భూమి కబ్జా
కాల్వ పొడవునా ఇరువైపులా రూ.వందల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. కొంతమంది ఎస్సారెస్పీ భూములు ఆక్రమించి ఇండ్లు కట్టుకోగా, ఇంకొందరు క్రయవిక్రయాలు జరిపారు. దీంతో అనంతసాగర్ నుంచి చింతగట్టు, భీమారం, పలివేల్పుల వరకు దాదాపు 25 కిలోమీటర్ల పొడవున్న కాల్వకు ఇరువైపులా ఆక్రమణలు వెలిశాయి. ఎస్సారెస్పీ కెనాల్ ను ఆనుకొని ఎలాంటి కన్ స్ట్రక్షన్ చేయాలన్నా ఇరిగేషన్ ఆఫీసర్ల నుంచి ఎన్వోసీ తప్పనిసరిగా తీసుకోవాలి.
కానీ, కొంతమంది కెనాల్ భూములను ఆక్రమించుకోవడంతోపాటు మున్సిపల్ అధికారులను మేనేజ్ చేసుకుని ఇంటి నెంబర్లు తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఓపెన్ ప్లాట్లకు కూడా ఇంటి నెంబర్లు పుట్టించి, వాటి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో ఇరిగేషన్ ఆఫీసర్లు కొన్నిచోట్ల కేసుల వరకు వెళ్లగా, వివాదాలు తలెత్తడంతో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఇంకొందరు రాజకీయ నాయకుల అండదండలతో దర్జాగా ఆక్రమణలోనే ఉంటున్నారు.
అన్నీ తెలిసీ సైలెంట్..
కెనాల్ భూముల ఆక్రమణ విషయం ఆఫీసర్లకు తెలిసినా లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మామూళ్లకు అలవాటు పడి కుర్చీల్లోంచి కదలకపోవడంతోనే ఇష్టారీతిన కబ్జాదారులు సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చింతగట్టు కెనాల్ వద్ద రూ.కోట్లు విలువైన భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి, అందులోనే డబ్బాలు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలున్నాయి. అధికారులను మెప్పించుకునే ఆయన కబ్జాలో ఉన్నాడనే ఆరోపణలుండగా, ఇటీవల స్థానికుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ ఆఫీసర్లు అక్కడ ట్రెంచ్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
కాల్వ బఫర్ జోన్ ను కొందరు బిజినెస్ అడ్డాలుగా మార్చుకోగా, ఇంకొందరు కాంపౌండ్లు తిప్పి అమ్మేసే పనిలో పడ్డారు. ఈ విషయాలన్నీ అధికారుల దృష్టిలో ఉన్నా ఆమ్యామ్యాలకు అలవాటు పడి లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఎస్సారెస్పీ భూముల రక్షణకు తగిన యాక్షన్ చేపట్టడంతోపాటు కబ్జాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం..
ఎస్సారెస్పీ భూముల ఆక్రమణల విషయం మా దృష్టికి వచ్చింది. భూముల కబ్జాపై విచారణ చేపడతాం. కబ్జాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తం. కెనాల్ భూములు ఆక్రమణకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. మంగీలాల్, ఎస్సారెస్పీ ఈఈ, హనుమకొండ