
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. శనివారం (అక్టోబర్ 4) ప్రకటించిన ఈ స్క్వాడ్ లో షమీని కనీసం పరిగణించలేదనే సమాచారం. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. షమీని ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టిన సెలక్టర్లు ఇకపై వన్డేల్లోనూ చెక్ పెట్టబోతున్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. వాస్తవానికి షమీ టీ20తో పాటు వన్డే ప్రణాళికల్లో లేడు. టెస్టుల్లో కూడా షమీ ఆడే సూచనలు కనిపించడం లేదు. చివరిసారిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన షమీ ఆ తర్వాత టీమిండియాలో కనిపించలేదు.
ఇంగ్లాండ్ టూర్ లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్ సత్తా చాటారు. వీరితో పాటు బ్యాకప్ సీమర్లుగా అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా జట్టులో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా టూర్ లో షమీ అనుభవం పనికివచ్చినా అతని ఫిట్ నెస్, ఫామ్ ను నమ్ముకునే స్థితిలో టీమ్ మేనేజ్ మెంట్ లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లోనూ షమీని ఎంపిక చేయలేదు. మొదట టీ20 కాకపోయినా వన్డే, టెస్టుల్లో షమీకి చోటు దక్కుతుందని భావించారు. అయితే ఆస్ట్రేలియా టూర్ కు షమీని పక్కన పెట్టడంతో ఈ సీనియర్ పేసర్ అవసరం లేదని జట్టు యాజమాన్యం చెప్పకనే చెప్పింది.
వాస్తవానికి ఐపీఎల్ లో ఘోరంగా విఫలం కావడం షమీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 9 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అప్పటికే ఫిట్‌నెస్, ఫామ్ తో ఇబ్బందిపడిన షమీకి ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఏ సిరీస్ లోనూ ఇండియా ఏ జట్టులో స్థానం దక్కలేదు. ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకొని నిరాశపరిచాడు. ఓవరాల్ గా షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తుంది. ఫామ్ లో లేని షమీని తీసుకొచ్చి ఆడించే సాహసం టీమిండియా సెలక్టర్లు చేయకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత వన్డే జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ , హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధృవ్ జురెల్, యశస్వి జైశ్వాల్
భారత టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, సంజు శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్