జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాశేశ్వరంలో మే21 నుంచి ప్రారంభమయ్యే సరస్వతి అంత్య పుష్కరాల పనుల్లో వేగం పెంచాలని దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజరామయ్యర్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరితో కలిసి జిల్లా ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 21 నుంచి నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం రూ.30.60 కోట్లు మంజూరు చేసిందని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
సరస్వతి ఆది పుష్కరాల్లో చేపట్టిన శాశ్వత ప్రాతిపదిక పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రసాదం కౌంటర్, రెయిలింగ్, సరస్వతి విగ్రహం వద్ద పెయింట్ వర్క్స్ గ్రానైట్ పర్చడం, అర్చ్ ల నిర్మాణం, విద్యుత్ పనులు, పెయింట్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, అడిషనల్ కలెక్టర్ ఆశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
