ఎనర్జీ డ్రింక్స్.. యువత ఇష్టపడి తాగుతుంటారు..అవి GenZకు సేఫేనా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఎనర్జీ డ్రింక్స్.. యువత ఇష్టపడి తాగుతుంటారు..అవి GenZకు సేఫేనా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఎనర్జీ డ్రింక్స్.. యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్స్.. రకరకాల బ్రాండ్లతో మార్కెట్ లో విచ్చలవిడిగా దొరికే డ్రింక్స్..ఆటలు ఆడేటప్పుడు అలసిపోకుండా, ఎనర్జీకోసం,  చదివేప్పుడు ఒత్తిడి పెరగకుండా, ఇక పార్టీలో ఫ్రెండ్స్ తో తాగేటప్పుడు వాటిలో కలుపుకొని మరీ ఎనర్జీ డ్రింక్స్ ను తాగుతుంటారు. అయితే ఎనర్జీ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిదా? ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తాగితే ఏమవుతుంది? డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకుందాం..

యువత తక్షణ శక్తి (ఎనర్జీ) కోసం, ఒత్తిడి, అలసట తగ్గించుకోవడానికి ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు.ఆకర్షించే యాడ్, స్నేహితుల ప్రభావం, రుచి కూడా దీనికి కారణం. అయితే ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక కెఫిన్ తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పరీక్షల సమయంలో చదువుకోవడానికి, లేదా రాత్రిళ్లు మేల్కొని పనిచేయడానికి కెఫిన్ అధికంగా ఉండే ఈ డ్రింక్స్ తాత్కాలికంగా సహాయపడతాయని యువత భావిస్తారు. స్పోర్ట్స్ ఆడేటప్పుడు, జిమ్ చేసేటప్పుడు తక్షణ శక్తిని ఇస్తాయని నమ్ముతారు. చాలా మంది యువకులు పార్టీలలో  ఆల్కహాల్ తో కలిపి కూడా వీటిని తాగుతుంటారు. సాధారణంగా ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే వీటిని ఎక్కువగా సేవిస్తుంటారు. యువత ఎక్కువగా ఇష్టపడి తాగే ఎనర్జీ డ్రింక్స్‌కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. 

ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే శక్తిని పక్కనబెడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఎనర్జీ డ్రింక్స్ లో అధికంగా ఉండే కెఫిన్,గ్వారానా, టౌరిన్ లేదా ఎల్-కార్నిటైన్, ఉండటం వల్ల నిద్రలేమి, గుండె దడ, రక్తపోటు, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వార్నింగ్ ఇస్తున్నారు.  

ఎనర్జీ డ్రింక్స్ పిల్లలకు సురక్షితమేనా?

ఎనర్జీ డ్రింక్ లో కెఫీన్, గ్వారానా, టౌరిన్ లేదా ఎల్-కార్నిటైన్ వంటి ఇతర ఉత్ప్రేరకాలను ఎక్కువగా ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్  (AAP) 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కెఫీన్ ఇవ్వవద్దని చెబుతోంది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలు ఒక రోజులో 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫీన్‌ను తీసుకోకూడదని సిఫార్సు చేస్తుంది. ఇది ఒక ప్రామాణిక కప్పు కాఫీలో ఉండే కెఫీన్ పరిమాణానికి సమానం.

ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే ప్రభావం..

ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల చేతులు వణకడం, కడుపునొప్పి, తలనొప్పి ,ఆందోళన వంటి లక్షణాలు కనిపించొచ్చు. ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగం పెరగడం, ఒక్కోసారి ప్రాణాలమీదకు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారికి ఇవి మరింత ప్రమాదకరం అంటున్నారు.