యుద్ధంతో అన్ని రంగాలూ కుదేలు..ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలి..ప్రభుత్వానికి ఫిక్కీ రిక్వెస్ట్

యుద్ధంతో అన్ని రంగాలూ కుదేలు..ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలి..ప్రభుత్వానికి ఫిక్కీ రిక్వెస్ట్

న్యూఢిల్లీ:పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల వివిధ రంగాలపై ఒత్తిడి కనిపిస్తోందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ తన నివేదికలో పేర్కొంది. తక్షణ ప్రమాదాలను తగ్గించడానికి, దీర్ఘకాలికంగా తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించింది. దీని ప్రకారం.. ఎంఎస్ఎంఈలకు అత్యవసర ఆర్థిక సాయం అందించాలి. సరఫరాలో జాప్యం జరిగే కంపెనీలపై జరిమానాలు విధించకుండా నిబంధనలు సడలించాలి.  

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై జీఎస్టీ కౌన్సిల్ చర్చలు ప్రారంభించాలి. దీనివల్ల ఖర్చులు తగ్గి పరిశ్రమల పోటీతత్వం పెరుగుతుంది. చమురు, గ్యాస్ సరఫరా కోసం ఇతర దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవాలి. దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాలను విస్తరించాలి. గ్రీన్ హైడ్రోజన్, బయో గ్యాస్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెట్టడం ద్వారా ఇంధన భద్రత సాధించవచ్చు. కంపెనీలు తమ బడ్జెట్లలో మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వెర్షన్ రూపొందించుకుని అమ్మకాలను, మార్జిన్లను మెరుగుపరుచుకోవాలి. 

అదనపు నిధుల మార్గాలను వెతుక్కోవాలి. కరెన్సీ రిస్క్ నుంచి రక్షణ పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముడి పదార్థాల కొరతను అధిగమించడానికి కొన్ని సంస్థలు ఇప్పటికే వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాయి. ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. సరఫరా గొలుసులో ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా గ్లోబల్ సప్లయర్స్ నుంచి వస్తువులను సేకరించాలని ఫిక్కీ రిపోర్ట్​సూచించింది.