లిక్కర్ స్కామ్.. అరబిందో ఫార్మాడైరెక్టర్ అరెస్టు

లిక్కర్ స్కామ్.. అరబిందో ఫార్మాడైరెక్టర్  అరెస్టు
  • శరత్ చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న ఈడీ
  • కేరళకు చెందిన లిక్కర్ వ్యాపారి బినోయ్ బాబు కూడా.. 
  • ఇద్దరినీ వారం పాటు ఈడీ కస్టడీకి అప్పగించిన సీబీఐ స్పెషల్ కోర్టు 
  • నిందితులు మహేంద్రు, విజయ్ నాయర్​తో తరచూ శరత్ మీటింగ్స్ 
  • రూ.100 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిపినట్లు గుర్తింపు 

హైదరాబాద్‌‌ / న్యూఢిల్లీ, వెలుగు: 
ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో మరో ఇద్దరిని ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. రాష్ట్రానికి చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌‌‌‌ పెనక శరత్‌‌ చంద్రారెడ్డి, కేరళకు చెందిన లిక్కర్‌‌‌‌ వ్యాపారి బినోయ్‌‌ బాబును గురువారం ఢిల్లీలో అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, పెర్నోడ్ రికార్డ్ ఇంటర్నేషనల్ లిక్కర్ బ్రాండ్స్ కంపెనీ జనరల్ మేనేజర్ బినోయ్ బాబును ఈడీ గత నెలలో పలుమార్లు ప్రశ్నించింది. బినోయ్‌‌ బాబుతో కలిసి శరత్‌‌ చంద్రారెడ్డి రిటైల్ లైసెన్స్ లు ఇప్పించినట్లు ఈడీ గుర్తించిందని తెలిసింది. ఈ స్కామ్‌‌లో పేర్కొన్న 31 లైసెన్సుల్లో బినోయ్‌‌ బాబు 29 లైసెన్సులను రిటైల్‌‌ వ్యాపారులకు ఇప్పించినట్లు ఆధారాలు సేకరించిందని సమాచారం. అక్రమ లావాదేవీలను సైతం గుర్తించిన ఈడీ.. వీటిపై వివరణ ఇవ్వాలని వీళ్లిద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా మళ్లీ సోమవారం నుంచి బుధవారం వరకు మూడ్రోజుల పాటు విచారించింది. అయితే సరైన డాక్యుమెంట్లు చూపకపోవడం, సరైన జవాబులు చెప్పకపోవడంతో వారిని అరెస్టు చేసింది. 

లిక్కర్ లైసెన్సుల రేట్లు ఫిక్స్ చేయడంలో శరత్‌‌‌‌ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది. స్కామ్‌‌‌‌లో శరత్‌‌‌‌ చంద్రారెడ్డిని కింగ్‌‌‌‌పిన్‌‌‌‌గా పేర్కొంది. ఈ కేసులో నిందితులైన విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌, సమీర్ మహేంద్రుతో కలిసి రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్న ట్రైడెంట్, ఆర్గోనామిక్స్, అవంతిక కాంట్రాక్టర్స్‌‌‌‌ కంపెనీలు ఢిల్లీలో రెండు కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ నిర్వహిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో నిందితుడైన సమీర్ మహేంద్రు కంపెనీ ఇండో స్పిరిట్ లో శరత్ చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టారు. ఐదు రిటైల్ జోన్స్ శరత్‌‌‌‌ చంద్రారెడ్డి కంట్రోల్‌‌‌‌లో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తమకు అనుకూలంగా పాలసీ రూపొందించడం కోసం జరిగిన ఆర్థిక లావాదేవీల్లో 30 శాతం ట్రైడెంట్ గ్రూపు కంపెనీల నుంచే జరిగినట్లు ఆధారాలు సేకరించిందని సమాచారం. రిటైల్ వ్యాపారులకు లైసెన్సులు ఇప్పించేందుకు శరత్ చంద్రారెడ్డి దాదాపు రూ.64.35 కోట్ల మనీలాండరింగ్‌‌‌‌ కు పాల్పడ్డారని గుర్తించింది. కాగా, ఈ కేసులో మొత్తం 34 మంది నిందితులు 140 ఫోన్లు ఛేంజ్ చేశారు. లిక్కర్​ స్కాం వెలుగులోకి రావడంతో ఫోన్లు మార్చారు. సెల్‌ ఫోన్లు మార్చడం కోసం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారు.

శరత్​ను కలిసిన సమీర్ మహేంద్రు, విజయ్ 
లిక్కర్ స్కామ్​లో ఇప్పటికే విజయ్ నాయర్, అభిషేక్ రావు, దినోశ్ అరోరాను సీబీఐ అరెస్టు చేయగా.. సమీర్ మహేంద్రును ఈడీ అరెస్టు చేసింది. ఈ స్కామ్ లో ఢిల్లీకి చెందిన ఇండో స్పిరిట్‌‌‌‌ కంపెనీ ఎండీ సమీర్‌‌‌‌ ‌‌‌‌మహేంద్రు కీలక పాత్ర పోషించాడు. విజయ్ నాయర్, పెర్నోడ్ రికార్డ్ మాజీ ఉద్యోగి మనోజ్ రాయ్, బ్రిండ్‌‌‌‌ కో స్పిరిట్స్‌‌‌‌కు చెందిన అమన్‌‌‌‌ దీప్ ధాల్‌‌‌‌తో కలిసి స్కామ్‌‌‌‌కి పాల్పడ్డాడు. సౌతిండియాలోని లిక్కర్ వ్యాపారులతో డీల్‌‌‌‌ చేశాడు. రాష్ట్రానికి చెందిన రాబిన్ డిస్టిలరీస్‌‌‌‌ డైరెక్టర్లు రామచంద్ర పిళ్లై, బోయిన్‌‌‌‌పల్లి అభిషేక్‌‌‌‌ రావు ద్వారా శరత్‌‌‌‌ చంద్రారెడ్డిని కాంటాక్ట్‌‌‌‌ అయ్యాడు. అరబిందో ఫార్మా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్న శరత్‌‌‌‌ చంద్రారెడ్డి.. ట్రైడెంట్‌‌‌‌ లైఫ్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌, ఆర్గోనామిక్స్, అవంతిక కంపెనీల్లోనూ డైరెక్టర్​గా ఉన్నారు. సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు, విజయ్‌‌‌‌ నాయర్‌‌‌‌లతో కలిసి ఆయన లిక్కర్ పాలసీ మీటింగ్స్‌‌‌‌లో పాల్గొన్నట్లు తెలిసింది. 

షరతులతో కస్టడీకి ఓకే.. 
అరెస్టు తర్వాత శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబును ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ హాజరు పరిచింది. వారిని వారం కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. విచారణ సమయంలో కుటుంబసభ్యులు, లాయర్లు కలిసేందుకు అనుమతి ఇచ్చింది. సీసీటీవీ కవరేజ్​లో విచారణ జరపాలని, ఇతర నిబంధనలు పాటించాలని ఆదేశించింది. కాగా, శరత్ చంద్రారెడ్డి కంపెనీ సీఈఓ చందన్​పై ఈడీ దాడి చేసిందని డిఫెన్స్ లాయర్ మనుశర్మ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.