
- ఫ్యూయెల్ స్విచ్‌లు ఆఫ్ కావడమే ఎయిరిండియా విమాన ప్రమాదానికి కారణం
- ప్రాథమిక నివేదికను విడుదల చేసిన ఏఏఐబీ
- పక్షులు ఢీకొట్టలే.. విద్రోహ చర్యపై అనుమానాలూ లేవని వెల్లడి
- పైలెట్ల తప్పిదమా? టెక్నికల ప్రాబ్లమా? ఇంకా తేలలే
- ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గత నెల 12న జరిగిన ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదానికి రెండు ఇంజన్లూ సడెన్‌గా ఫెయిల్ కావడమే కారణమని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) వెల్లడించింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఒక్క సెకను తేడాలోనే ఫ్యూయెల్ స్విచ్‌లు కటాఫ్ పొజిషన్లోకి వెళ్లాయని, దీంతో ఫ్యూయెల్ అందక రెండు ఇంజన్లూ ఒకేసారి ఫెయిల్ అయి.. ప్రమాదానికి దారితీసినట్టు తెలిపింది. ఈ విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడం కారణం కాదని.. అలాగే విద్రోహ చర్యే కారణమనేందుకు కూడా ఆధారాలు లేవని పేర్కొంది. జూన్ 12న మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా ఏఐ171 బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సమీపంలోని మెడికల్ కాలేజీ భవనాలపై కూలిపోయింది.
ఈ ఘటనలో విమానంలోని 242 మందిలో ఒక ప్యాసింజర్ మినహా మిగతా వారంతా మృతిచెందారు. మెడికల్ కాలేజీలో ఉన్న డాక్టర్లు, ఇతర స్టాఫ్ మరో 19 మంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ ఈ మేరకు 15 పేజీల ప్రాథమిక నివేదికను శుక్రవారం రాత్రి విడుదల చేసింది.‘‘విమానం సరిగ్గానే టేకాఫ్ అయింది. కొన్ని సెకన్లలోనే గరిష్టంగా 180 నాట్స్ (గంటకు 333 కి.మీ.) వేగానికి చేరుకుని, స్థిరంగా పైకి ఎగిరింది. విమానం రెక్కలపై ఉండే ఫ్లాప్ (రేకులు)ల సెట్టింగ్ కూడా బాగానే ఉంది. ల్యాండింగ్ గేర్ కూడా డౌన్ పొజిషన్ లోనే ఉంది. ఇవన్నీ సజావుగానే ఉన్నాయి. వాతావరణం కూడా పూర్తి అనుకూలంగా ఉంది. పక్షులు కూడా ఎగరలేదు.
కానీ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానంలోని రెండు ఇంజన్ల ప్యూయెల్ కంట్రోల్ స్విచ్‌లు రన్ పొజిషన్ నుంచి కటాఫ్ పొజిషన్‌కు వెళ్లాయి. దీంతో రెండు ఇంజన్లకూ వెంటనే ఫ్యూయెల్ సప్లై ఆగిపోయింది. రెండు ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు ర్యామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) ఆన్ అవుతుంది. సీసీటీవీ ఫుటేజీలోనూ ర్యాట్ (విమానం కింద ఉండే చిన్న ప్రొఫెల్లర్) ఆన్ కావడం కనిపించింది. అయినా విమానం పైకి ఎగరలేక కొన్ని సెకన్లలోనే కూలిపోయింది” అని ఏఏఐబీ నివేదికలో వివరించింది. కాగా, ప్రస్తుతానికి బోయింగ్ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ఏఏఐబీ సిఫారసు చేయలేదు.
బ్లాక్ బాక్స్‌లో పైలెట్ల సంభాషణ రికార్డ్..
విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కేవలం 32 సెకన్లలోనే కూలిపోయిందని ఏఏఐబీ నివేదికలో వెల్లడించింది. ‘‘ప్రమాద సమయంలో ఇంజన్ల ఫ్యూయెల్ స్విచ్‌లు ఆఫ్ కావడంపై పైలెట్ల మధ్య జరిగిన సంభాషణ బ్లాక్ బాక్స్‌లో రికార్డ్ అయింది. ఆ సమయంలో విమానాన్ని కో పైలెట్ క్లైవ్ కుందర్ నడుపుతుండగా, కెప్టెన్ సుమీత్ సభర్వాల్ మానిటర్ చేస్తున్నారు. ఇంజన్లు ఆఫ్ కావడం గమనించిన వెంటనే ఒక పైలెట్.. ఫ్యూయెల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావు? అని అడగగా.. మరో పైలెట్ తాను ఆఫ్ చేయలేదని చెప్పడం వినిపించింది” అని ఏఏఐబీ తెలిపింది.
ఆ తర్వాత కొన్ని సెకన్లకే ఫ్యూయెల్ స్విచ్‌లను తిరిగి రన్ పొజిషన్లోకి మార్చారని.. కానీ, ఇంజన్ 1 మాత్రమే పనిచేసి, ఇంజన్ 2 ఫెయిల్ కావడంతో విమానం ఎత్తుకు ఎగరలేక క్రాష్ అయిందని వివరించింది. అయితే, ఫ్యూయెల్ స్విచ్‌లను పైలెట్లలో ఎవరో ఒకరు పొరపాటుగా ఆఫ్ చేశారా? లేదా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగిందా? అన్నది ఇంకా తేలాల్సి ఉందని పేర్కొంది. అలాగే, బోయింగ్ విమానాల ప్యూయెల్ స్విచ్ లాకింగ్ సిస్టమ్ తనిఖీ, రీప్లేస్ చేయడంపై యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) 2018లో ఒక అడ్వైజరీ మాత్రమే జారీ చేసిందని.. తప్పనిసరిగా ఈ సిస్టమ్‌ను ఇంత కాలంలో రీప్లేస్ చేయాలని చెప్పలేదని ఎయిరిండియా పేర్కొన్నట్టు ఏఏఐబీ తెలిపింది.
ఫ్యూయెల్ స్విచ్‌లు ఎందుకు ఆఫ్ అయ్యాయి?
విమానంలో ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్‌లు అంత ఈజీగా ఆన్, ఆఫ్ కావని ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నారు. విమానం కాక్ పిట్లో ఇద్దరు పైలెట్ల మధ్య ఉండే ప్యానెల్‌పై రెండు ఇంజన్లకు రెండు ప్యూయెల్ స్విచ్‌లు కొన్ని ఇంచుల దూరంలో ఉంటాయి. వీటి పొజిషన్ మార్చాలంటే గట్టిగా పైకి లాగి, ఆ తర్వాత కిందికి (కటాఫ్) లేదా పైకి (రన్) పొజిషన్ మార్చాల్సి ఉంటుంది. అందుకే ఆటోమేటిక్‌గా లేదంటే పొరపాటున చేయి తాకినా లేదంటే సాఫ్ట్ వేర్ వైఫల్యం, పవర్ సప్లై ఆగిపోవడం వంటివి జరిగినా ప్యూయెల్ స్విచ్ లు కదిలే అవకాశమే లేదని అంటున్నారు. పైలెట్లలో ఎవరో ఒకరు మ్యానువల్‌గా స్విచ్ ఆఫ్ చేయడానికి మాత్రమే చాన్స్ ఉందని చెప్తున్నారు.
మరోవైపు టేకాఫ్సమయంలో ఫ్లైట్ నడుపుతున్న కోపైలెట్ రెండు చేతులూ రెండు హ్యాండిల్స్పైనే ఉంటాయని, మానిటర్ చేస్తున్న పైలెట్ చేతులే ఖాళీగా ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే, కాక్ పిట్ సంభాషణ రికార్డులో స్విచ్‌లు ఆఫ్ ఎందుకు ఆఫ్ చేశావని అడిగిన పైలెట్ ఎవరన్నది మాత్రం ఏఏఐబీ వెల్లడించలేదు. అయితే, ఇద్దరు పైలెట్లూ చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవారే కావడంతో వాళ్లలో ఏ ఒక్కరూ కావాలనే ప్యూయెల్ స్విచ్‌లు ఆపేసే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. మరోవైపు మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల స్విచ్‌లు ఆఫ్ అయ్యాయా? లేదంటే స్విచ్‌లు ఆన్‌లో ఉన్నట్టు చూపినా.. ఇంజన్లకు ఫ్యూయెల్ సప్లై ఆగిపోయిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరగాల్సి ఉందని భావిస్తున్నారు.
ఇప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దు: రామ్మోహన్ నాయుడు
ఎయిరిండియా విమాన ప్రమాదానికి కారణంపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దర్యాప్తు సంస్థ ఏఏఐబీ విడుదల చేసింది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, తుది నివేదిక విడుదల చేసేంత వరకూ ప్రజలు, మీడియా సంయమనం పాటించాలని కోరారు. ఈ ప్రమాద ఘటనలో అనేక టెక్నికల్ అంశాలు ఉన్నందున దర్యాప్తు సవాలుగా మారిందని, దీనిపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదన్నారు.
ఏఏఐబీ నివేదికను అనలైజ్ చేస్తున్నామని, దర్యాప్తు పూర్తయ్యాకే కచ్చితంగా ఏం జరిగిందో తెలియజేస్తామన్నారు. ‘‘ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభ కలిగిన పైలెట్లు, సిబ్బంది మన వద్ద ఉన్నారు. ఏవియేషన్ ఇండస్ట్రీకి పైలెట్లు, సిబ్బందే వెన్నెముకలాంటి వారు” అని ఆయన పేర్కొన్నారు. కాగా, విమాన ప్రమాద ఘటనలో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నామని ఎయిరిండియా, బోయింగ్ సంస్థలు తెలిపాయి. మృతుల కుటుంబాలకు మరోసారి ప్రగాఢ సానుభూతి ప్రకటించాయి.
ఆ రోజున ఏ క్షణం ఏం జరిగిందంటే..
- ఉదయం 11:17 గంటలు: ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా ఏఐ171 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది.
- మధ్యాహ్నం 01.37:37 గంటలు: విమానం రన్ వే నంబర్ 23 మీదుగా లండన్ బయల్దేరేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) క్లియరెన్స్ ఇచ్చింది. ఆ వెంటనే విమానం టేకాఫ్ ప్రారంభమైంది.
- 01.38.39: రన్ వే నుంచి విమానం గాలిలోకి ఎగిరింది.
- 01.38.42: విమాన వేగం 180 నాట్స్‌కు చేరుకుంది. ఆ వెంటనే రెండు ఇంజన్ల ఫ్యూయెల్ స్విచ్‌లూ ఒక్క సెకను తేడాతో రన్ మోడ్ నుంచి కట్ ఆఫ్ మోడ్‌లోకి వెళ్లాయి. అకస్మాత్తుగా ఫ్యూయెల్ సప్లై ఆగిపోవడంతో ఇంజన్లు రెండూ స్లో అయ్యాయి. ఇంజన్లు రెండూ ఆగిపోయిన వెంటనే విమానం మధ్యలో కిందవైపు ఉండే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) వెంటనే ఆన్ అయింది. ఆ వెంటనే సమస్యను గుర్తించిన ఒక పైలట్.. ఫ్యూయెల్ స్విచ్ ఎందుకు ఆఫ్చేశావని మరో పైలట్‌ను అడగగా.. ఆయన తాను ఆఫ్ చేయలేదన్నారు.
- 01.38.47: రెండు ఇంజన్ల స్పీడ్ కనీస వేగానికంటే తక్కువకు పడిపోయింది. ర్యాట్ పంప్ నుంచి విమా నానికి హైడ్రాలిక్ పవర్ అందడం మొదలైంది.
- 01.38.52: ఇంజన్ 1 ఫ్యూయెల్ స్విచ్ కటాఫ్ మోడ్ నుంచి తిరిగి రన్ మోడ్‌కు మారింది.
- 01.38.56: ఇంజన్ 2 ఫ్యూయెల్ స్విచ్ కూడా రన్ పొజిషన్లోకి వచ్చింది. రెండు ఇంజన్లూ తిరిగి ఆన్ అయ్యా యి. ఇంజన్ 1 రికవర్ కావడం మొదలైంది. కానీ, ఇంజన్ 2 మాత్రం రికవర్ కాకపోవడంతో విమానం ఎత్తును తిరిగి పెంచడం సాధ్యం కాలేదు.
- 01.39.05: ఒక పైలట్ ‘మేడే మేడే మేడే’ అంటూ డిస్ట్రెస్ కాల్ పంపాడు.
- 01.39.11: విమానంలో డేటా రికార్డ్ కావడం ఆగిపోయింది.
- 01.44.44: ఎయిర్ పోర్టు నుంచి ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి బయలుదేరారు.