
చిన్నప్పుడు అమ్మానాన్నలు చెప్పే కథలు ఎంతోమందికి జీవితపాఠాలయ్యాయి. వాళ్లు పిల్లలకు నేర్పించిన విషయాలు, చూపించిన ప్రదేశాలు.. వింతలు, విశేషాలతో కూడిన ఎన్నో అనుభవాలు పెద్దయ్యాక వాళ్లకు మార్గదర్శకంగా మారతాయంటే అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనమే దుబాయ్‌లో ఉంటోన్న మనమ్మాయి ముగ్ధ పొలిమెర. ఆకాశమే తన హద్దుగా అడుగులు వేస్తూ.. ప్రస్తుతం నాసాతో కలిసి పనిచేస్తున్న ముగ్ధ సక్సెస్ జర్నీ ఆమె మాటల్లోనే..
నాన్నది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు. అమ్మది కర్నాటక కోలార్ జిల్లాలోని బంగరపేటలో ఉండే తెలుగు ఫ్యామిలీ. నేను పుట్టింది కూడా అక్కడే. నా చిన్నతనంలోనే మా ఫ్యామిలీ దుబాయ్‌కి షిఫ్ట్ అయింది. అలా నా బాల్యం అంతా అబుదాబీ, దుబాయ్‌ల్లో గడిచింది. కానీ, భారతీయ సంస్కృతి ప్రభావం నాపై చాలా ఉంది. నేను సీబీఎస్ఈ స్కూల్లో చదివా. మూడు భారతీయ భాషలు నేర్చుకున్నా. ఇంకా చాలా భాషలను అర్థం చేసుకోగలను.
అలాగే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నా. మా నాన్న చెప్పే చందమామ కథలంటే నాకెంతో ఇష్టం. నిజానికి, చిన్నప్పుడు నా మొదటి “గురువులు” నక్షత్రాలే. సప్తర్షి, ఏడు ఋషుల నక్షత్రాలు (బిగ్ డిప్పర్), వారి భార్యలు, కృత్తికలు (ప్లీయాడ్స్ స్టార్ క్లస్టర్) గురించిన కథలు నన్ను ఆకర్షించాయి. అవి కేవలం నిద్రపోవడానికి చెప్పే కథలు కాదు. ఖగోళ పాఠాలు.
ఇంజినీర్ టు సైంటిస్ట్
నేను ఖగోళశాస్త్రవేత్తను (ఆస్ట్రోఫిజీసిస్ట్). నేను దుబాయ్‌లోని బిట్స్ పిలానీలో -ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశా. ఇది నాకు కోడింగ్, డేటా విశ్లేషణలో బలమైన పునాది వేసింది. ఆ తర్వాత, నక్షత్రాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని డిసైడ్ అయ్యా. ఫ్లోరిడా యూనిర్సిటీలో ఖగోళశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశా. అక్కడ బ్లాక్ హోల్స్‌పై పరిశోధన మొదలుపెట్టా. నేను నేర్చుకున్న ఇంజినీరింగ్, కోడింగ్, భౌతిక శాస్త్ర శిక్షణను ఖగోళశాస్త్రం కోసం ఉపయోగించడం చూస్తే.. నాకు అన్నీ కలిసివచ్చాయి అనిపిస్తుంది.
ఆ తర్వాత నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచి 2023లో ఖగోళ శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నా. నా థీసిస్ పరిశోధన, చిన్న సమీప గెలాక్సీలలో దాగి ఉన్న బ్లాక్ హోల్స్‌ను కనుగొనడానికి కొత్త టెక్నిక్‌లను ఉపయోగించడం. నా ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఖగోళ శాస్త్ర ప్రాజెక్టులకు వాడడం చాలా శాటిస్ఫాక్షన్ ఇస్తోంది. ప్రతి కొత్త ప్రాజెక్ట్ డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్ని అందించింది. ఈ మార్గంలో నేను సంక్లిష్ట వ్యవస్థలను కోడ్ చేయడం, ఖగోళ డేటాను వివరించడం నేర్చుకున్నా. ఇవన్నీ నేను ఇప్పుడు నా పనిలో వాడుతున్నా.
అచీవ్మెంట్స్
నా పీహెచ్‌డీ సమయంలో చిన్న గెలాక్సీలలో దాగి ఉన్న భారీ బ్లాక్ హోల్స్, ఒక పెద్ద ట్రెజర్ని కనుగొన్న ప్రాజెక్ట్‌ను నడిపించా. వీటిని“డ్వార్ఫ్ గెలాక్సీలు” అంటాం. ఈ బ్లాక్ హోల్స్ గురించి దశాబ్దాలుగా ట్రెడిషనల్ రీసెర్చ్ మెథడ్స్ వాటిని చిన్న గెలాక్సీలలో కనుక్కోలేకపోయాయి. చాలామంది “విచిత్రమైనవి(ఆడ్ బాల్స్)” అని విస్మరించిన గెలాక్సీల మీద స్టడీ చేయడం ద్వారా వాటిని గుర్తించే కొత్త మార్గాన్ని డెవలప్ చేశాం. వీటిలో చాలావరకు దాగి ఉన్న బ్లాక్ హోల్స్‌తో డ్వార్ఫ్ గెలాక్సీలుగా ఉన్నాయని తేలింది. డేటాను విశ్లేషించే విధానాన్ని మార్చడం ద్వారా మేం ఎవరూ చూడని ఒక సెన్సెస్‌ను వెలికితీశాం.
మా మెథడ్‌ని ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు స్వీకరించారు. అంతేకాదు.. అదే టైంలో ఫిజిక్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా నా కోర్సును రీడిజైన్ చేశా. దాంతో టీచింగ్ అవార్డ్ కూడా దక్కింది. ప్రస్తుతం నేను నాసా, ఆస్ట్రోఫిజిక్స్ డేటా సిస్టమ్‌ను మెరుగుపరచడానికి పనిచేస్తున్నా. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు ప్రతిరోజూ ఉపయోగించే డిజిటల్ లైబ్రరీ. దానిని మరింత శక్తివంతంగా యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి పనిచేస్తున్నా. నేను పదేండ్లుగా ఉపయోగిస్తున్న వ్యవస్థపై పనిచేయడం నిజంగా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. నేను యూనివర్స్ టీబీడీ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు నామినేట్ అయ్యా.
ఈ ప్రయాణంలో మోటివేషన్..
విశ్వం గురించి అర్థం చేసుకోవాలనే కోరిక నన్ను ప్రతిరోజూ ముందుకు నడిపిస్తుంది. నా తల్లిదండ్రులు మొదటి రోజు నుంచి నా అతిపెద్ద సపోర్టర్స్. నేను గెలాక్సీలు, బ్లాక్ హోల్స్‌ను అన్వేషించాలని చెప్పినప్పుడు వారు నన్ను నమ్మారు. నా పీహెచ్‌డీ అడ్వైజర్ డాక్టర్ షీలా కన్నప్పన్, నాకు సాంకేతిక నైపుణ్యాలను మాత్రమే కాకుండా మా పరిశోధనలో శాస్త్రాన్ని సమర్థవంతంగా సమాచారం చేయడం ఎంత ముఖ్యమో నేర్పించింది. ఇప్పుడు, నాసా ఆస్ట్రోఫిజిక్స్ డేటా సిస్టమ్స్‌లో నాకు మంచి నెట్‌వర్క్ ఉంది. సైన్స్ ఒక టీం స్పోర్ట్. వాళ్లతో కలిసి పనిచేయడం ద్వారా నా స్కిల్స్ డెవలప్ చేసుకున్నా.
నాసా ఏడీఎస్, సైన్స్ ఎక్స్‌ప్లోరర్ ప్రాజెక్ట్స్..
నేను ప్రస్తుతం హార్వర్డ్ -స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌లో పనిచేస్తున్నా. నాసా ఆస్ట్రోఫిజిక్స్ డేటా సిస్టమ్ (ఏడీఎస్), సైన్స్ ఎక్స్‌ప్లోరర్ (సైఎక్స్) అనే కొత్త ఇనిషియేటివ్‌ల కోసం నా టైంని కేటాయిస్తున్నా. శాస్త్రవేత్తలు రీసెర్చ్ కోసం వాడే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను డిజైన్, డెవలప్ చేయడానికి నేను పనిచేస్తున్నా. ఏడీఎస్ అనేది ఖగోళ శాస్త్ర పరిశోధనలకు వెన్నెముకలాంటిది. శాస్త్రీయ పత్రికలు, డేటా, భారీ డేటాబేస్, దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు 30 సంవత్సరాలకు పైగా ఆధారపడ్డారు. నేను ఏడీఎస్ బృందంలో సాఫ్ట్‌వేర్, డేటా పైప్‌లైన్ డెవలపర్‌గా పనిచేస్తున్నా. పరిశోధకులు సమాచారాన్ని కనుగొనడం, విశ్లేషించడం ఎలా మెరుగుపరచాలో పనిచేస్తా.
సైన్స్ ఎక్స్‌ప్లోరర్ ప్రాజెక్ట్‌తో మేం ఏడీఎస్ నుంచి ఆ నైపుణ్యాన్ని తీసుకొని దానిని భూ, అంతరిక్ష శాస్త్రాలకు విస్తరిస్తున్నాం. మేం ఒక ఇంటర్ డిసిప్లినరీ పోర్ట్‌లను నిర్మిస్తున్నాం. కాబట్టి మీరు ఖగోళ, భూగర్భ, లేదా వాతావరణ శాస్త్రవేత్త అయినా మీరు సైంటిఫిక్ లిటరేచర్, డేటాసెట్‌లను ఒకే చోట ఈజీగా అన్వేషించొచ్చు. నా జాబ్‌లో చాలా బ్యాక్ -ఎండ్ డెవలప్‌మెంట్ ఉంటుంది. నేను డేటాబేస్‌లను ఇంటిగ్రేట్ చేస్తా. సెర్చ్, ఎనాలసిస్ కోసం ఏఐను కూడా వాడుతున్నాం. ఇది సైంటిఫిక్ కమ్యూనిటీకి ఉపయోగపడే పవర్‌ఫుల్ ప్లాట్‌ఫాం.
అల్టిమేట్ గోల్
నాకు రెండు యాంబిషన్స్ ఉన్నాయి. ఒక శాస్త్రవేత్తగా విశ్వం గురించి మన అవగాహన సరిహద్దులను ముందుకు వెళ్లేలా ప్రోత్సహించడం. ఒక మనిషిగా ఇతరులు ఈ మార్గంలో వెళ్లేలా చేయూతనివ్వడం. విశ్వం గురించి మన జ్ఞానాన్ని విస్తరింపజేసి, కొత్త తరం అన్వేషకులకు ఇన్స్పిరేషన్గా మారడమే నా అల్టిమేట్ గోల్.
ఎన్నో సవాళ్లు
నా ఈ జర్నీలో మొదటి చాలెంజ్ ఇంజినీరింగ్ నుంచి ఖగోళ శాస్త్రానికి మారడం. ఖగోళ శాస్త్రంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. మరో పెద్ద సవాలు నేను గ్రాడ్ స్కూల్ కోసం మొదటిసారి యూఎస్‌కు వచ్చినప్పుడు, రెండు ఫుల్ టైం జాబ్స్ మధ్య జగ్లింగ్ చేస్తున్నట్లు అనిపించింది. ఒకటి నా రీసెర్చ్, మరొకటి కొత్త దేశంలో జీవితాన్ని గడపడం నేర్చుకోవడం. కానీ, ప్రతి సవాలు నాకు పట్టుదలను నేర్పింది. అవన్నీ సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే, ‘‘విశ్వం’’ విసిరే సవాళ్లకు సిద్ధంగా ఉన్నా.
శాస్త్రవేత్తగా మారడానికి ప్రేరణ..
చిన్నతనంలో ప్రతి విషయాన్నీ ఆసక్తిగా తెలుసు కునేదాన్ని. నా పేరెంట్స్, టీచర్స్ కూడా ప్రశ్నలు అడగమని ప్రోత్సహించారు. వారికి ఆన్సర్స్ తెలి యకపోతే, మేం కలిసి అన్వే షించే వాళ్లం. అప్పుడు మేం దాన్ని “వైజ్ఞానిక ఆలో చన” అనుకోలేదు. కానీ, ఇప్పుడు ఆలోచిస్తే, అది అదే.