హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌ వాసులకు అందుబాటులో ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ విద్య

హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌ వాసులకు అందుబాటులో ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ విద్య
  •     గతేడాది ఏర్పాటైన యూనివర్సిటీ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో 5 కోర్సుల్లో 300 సీట్లు 
  •     యూనివర్సిటీ కాలేజీలో చేరండని మంత్రి పొన్నం ప్రచారం

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ వాసులకు ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీ విద్య అందుబాటులోకి వచ్చింది. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో గతేడాది ఏర్పాటైన ఇంజినీరింగ్ కాలేజీలో 5 కోర్సుల్లో 300 సీట్లు ఉన్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.  శాతవాహన యూనివర్సిటీ కాలేజ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌(ఎస్‌‌‌‌‌‌‌‌యూసీఈ) అడ్మిషన్ల కోసం స్వయంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఇటీవల హైదరాబాద్​ సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో మీడియా సమావేశంలో కాలేజీకి సంబంధించిన బ్రోచర్లు, పోస్టర్లను విడుదల చేశారు. ఎప్‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులు కాలేజీ కోడ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌యూసీఈ సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

5 కోర్సుల్లో 300 సీట్లు

గత విద్యాసంవత్సరం (2025–26) నుంచే బీటెక్‌‌‌‌‌‌‌‌లో నాలుగు కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. సీఎస్‌‌‌‌‌‌‌‌ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈసీఈ, ఇన్ఫర్మేషన్​టెక్నాలజీ(ఐటీ), కోర్సుల్లో ఒక్కో దానికి 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లను కేటాయించారు. కాగా గతేడాది సరైన ప్రచారం లేకపోవడంతో కేవలం 69 అడ్మిషన్లు మాత్రమే అయ్యాయి. ఈసారి ఎలాగైనా అడ్మిషన్లు పూర్తి చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం మరో కొత్త కోర్స్ బయోటెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఈసారి 5 కోర్సుల్లో 300 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 

ఉత్తర తెలంగాణలోనే హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌ను ఎడ్యుకేషన్ హబ్‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా మైనింగ్ కోర్సును కూడా మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఇటీవల లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఈ కోర్సు సీట్లు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రైవేట్ కాలేజీల్లో లక్షల రూపాయల ఫీజులు భరించలేక పేద విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. దీంతోపాటు ఆయనే స్వయంగా అడ్మిషన్ల ప్రచారానికి నడుం బిగించారు. 

సొంత బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ల కోసం రూ.44.12కోట్లు 

కాలేజీకి శాశ్వత భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే 36 ఎకరాల భూమిని కేటాయించింది. బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ల కోసం రూ.44.12 కోట్లు కూడా మంజూరు చేసింది. ఈ బిల్డింగ్స్ పూర్తయ్యేలోపు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లో తాత్కాలికంగా అడ్మిషన్లు, క్లాసులు ప్రారంభించారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యంతో పాటు బాయ్స్, గర్ల్స్‌‌‌‌‌‌‌‌కు విడివిడిగా హాస్టల్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.