
- 119 రన్స్ తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపు
- రాణించిన బెయిర్‌స్టో, రాయ్
చెస్టర్ లీ స్ర్టీట్: సెమీస్ బెర్త్ దక్కాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెచ్చిపోయింది. ఓపెనర్లు బెయిర్‌స్టో (106), జేసన్ రాయ్ (60) దుమ్మురేపడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 119 రన్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. దీంతో 12 పాయింట్లతో నాకౌట్బెర్త్ను ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 305 పరుగులు చేసింది. . ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన ఓపెనర్లు కివీస్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు. ఓవర్‌కు ఒకటి, రెండు బౌండరీల చొప్పున బాదడంతో తొలి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 67 రన్స్ చేసింది. తర్వాత కూడా అదే జోరును కనబరుస్తూ రాయ్(55 బాల్స్), బెయిర్ స్టో (46) హాఫ్ సెంచరీ చేశారు. ఈ జంటను విడదీసేందుకు విలియమ్సన్19వ ఓవర్లో నీషమ్(2/41)ను ప్రయోగించాడు. ఈ వ్యూహం ఫలించి రాయ్ ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
రూట్(24)ను ఓఎండ్లో నిలబెట్టి మరింత వేగంగా ఆడిన బెయిర్‌స్టో.. 28వ ఓవర్లో సౌథీ బంతిని సిక్సర్‌గా మలిచాడు. రెండోఎండ్‌లో రూట్పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ఇంగ్లండ్ 31 ఓవర్లలో 194/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. బెయిర్‌స్టో దూకుడు చూస్తే 400 స్కోరు ఖాయమనుకున్నా.. పిచ్ స్లోగా మారడంతో కివీస్ బౌలర్లు పుంజుకున్నారు. కట్టుదిట్టమైన బంతులు వేసిన బౌల్ట్ (2/56), హెన్రీ (2/54) స్వల్ప విరామాల్లో రూట్, బట్లర్(11), బెయిర్‌స్టో ను ఔట్ చేసి కట్టడి చేశారు. దీంతో ఇంగ్లండ్214 రన్స్‌కు 4 వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే స్పిన్నర్ శాంట్నర్(1/65).. స్టోక్స్ (11)ను పెవిలియన్‌కు పంపడంతో స్కోరు 248/5గా మారింది. అయితే చివర్లో మోర్గాన్ (42), రషీద్(16), ఫ్లంకెట్(15 నాటౌట్) కొద్దిగా హిట్టింగ్చేయడంతో స్కోరు 300 దాటింది.
కివీస్ విలవిల..
306 పరుగుల టార్గెట్‌ను ఛేజ్చేసే క్రమంలో కివీస్ 45 ఓవర్లలో 186 రన్స్ మాత్రమే చేసి ఓడింది. లాథమ్ (57) టాప్ స్కోరర్. ఇంగ్లీష్ బౌలర్ల దాటికి బ్లాక్ క్యాప్స్ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 14 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన కివీస్ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. విలియమ్సన్ (27), టేలర్ (28) మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. మిడిలార్డర్లో లాథమ్ ఒంటరిపోరాటం చేసినా.. రెండోఎండ్‌లో సహకారం కరువైంది. నీషమ్(19)తో ఐదో వికెట్‌కు 54, శాంట్నర్ (12)తో ఏడో వికెట్‌కు 36 రన్స్జత చేసినా.. అప్పటికే రన్రేట్బాగా పెరిగిపోయింది. 39వ ఓవర్లో లాథమ్ఔటైన తర్వాత కివీస్ఇన్నింగ్స్పేకమేడలా కూలింది.
పాక్ కథ ముగిసినట్లే!
ఇంగ్లండ్ గెలుపుతో సెమీస్‌పై ఆశలు పెట్టుకున్న పాక్ కథ దాదాపుగా ముగిసింది. ఒకవేళ కివీస్‌ను కాదని దాయాది టీమ్ముందంజ వేయాలంటే.. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 356 రన్స్‌తేడాతో గెలవాలి. ఉదాహరణకు పాక్400 స్కోరు చేస్తే బంగ్లాను 84కు ఆలౌట్చేయాలి. తక్కువ స్కోర్లు నమోదైనా.. గెలుపు మార్జిన్ మాత్రం ఈ స్థాయిలో ఉండాల్సిందే. ఒకవేళ బంగ్లా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పాక్‌కు ఫలితం కూడా అవసరం ఉండదు. కాబట్టి నాలుగో జట్టుగా కివీస్‌కు దాదాపుగా బెర్త్ కన్ఫామ్.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్: 305/8 (బెయిర్‌స్టో 106, రాయ్ 60, బౌల్ట్2/56, హెన్రీ 2/54, నీషమ్2/41).
న్యూజిలాండ్: 186 ఆలౌట్(లాథమ్57, ఫ్లంకెట్3/34).