ENG vs ZIM: ముగ్గురు సెంచరీలు.. తొలి రోజే 498 పరుగులు: జింబాబ్వేను ఆటాడుకున్న ఇంగ్లాండ్

ENG vs ZIM: ముగ్గురు సెంచరీలు.. తొలి రోజే 498 పరుగులు: జింబాబ్వేను ఆటాడుకున్న ఇంగ్లాండ్

జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. గురువారం (మే 22) నాటింగ్ హమ్ వేదికగా ట్రెంట్ బ్రిడ్జ్ లో ప్రారంభమైన మ్యాచ్ లో తొలి రోజే భారీ స్కోర్ చేయడం విశేషం. పసికూన జింబాబ్వేపై ఇంగ్లాండ్ ప్రతాపం చూపించారు. ఆడుతుంది టెస్ట్ అయినప్పటికీ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. దీంతో తొలి రోజే ఇంగ్లాండ్ 88 ఓవర్లలో 498 పరుగుల భారీ స్కోర్ చేయడం విశేషం. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు ఏకంగా 231 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మాధవీర విడగొట్టాడు. హిట్టింగ్ తో 134 బంతుల్లోనే 140 పరుగులు చేసిన బెన్ డకెట్ ఔటయ్యాడు. ఈ దశలో క్రాలీ, ఓలీ పోప్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్ కు వీరిద్దరూ 137 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలో సెంచరీ చేసిన క్రాలీ 124 పరుగుల వద్ద సికిందర్ రాజా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. 

ఆ తర్వాత పోప్, రూట్  కలిసి మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. రూట్ 34 పరుగులు చేసి ఔటైనా పోప్ 170 పరుగులు చేసి జెయంగా నిలిచాడు. టాపార్డర్ లో ముగ్గురు సెంచరీలతో అదరగొట్టడంతో తొలి రోజు అట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. క్రీజ్ లో పోప్ (169), హ్యారీ బ్రూక్ (9) ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో మధవీర,సికిందర్ రాజా, ముజరభని తలో వికెట్ పడగొట్టారు.