
అహ్మదాబాద్: ఇంగ్లండ్-ఇండియా మధ్య చివరి 5వ టీ20లో భారత్ 224 పరుగులు చేసింది. 20 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన సహచరులకు చక్కటి సహకారం అందిస్తూ.. రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా చివరి వరకు జోరు కొనసాగించేలా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 20 ఓవర్లు ముగిసే సమయానికి కోహ్లి 80 పరుగులు (52 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సులు), హార్దిక్ పాండ్యా 39 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లతో) చేశారు.
టీ20ల్లో ఇంగ్లండ్ పై ఇదే అత్యధిక స్కోర్
టీ20ల్లో ఇంగ్లండ్ పై ఇండియా భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 2-2తో సిరీస్ సమం కావడంతో చివరిదైన ఈ ఐదవ వన్డే లో గెలుపు కీలకంగా మారిన నేపధ్యంలో ఎలాగైనా సిరీస్ నెగ్గాలన్న పట్టుదలతో ఉన్న ఇరు జట్లు బరిలోకి దిగాయి. కేఎల్ రాహుల్ ను తప్పించి టి.నటరాజన్ కు తుది జట్టులో అవకాశం కల్పించారు.
ఓపెనర్లుగా కోహ్లి-రోహిత్
సిరీస్ విజేతను నిర్ణయించే ప్రతిష్టాత్మకమైన ఈ 5వ టీ-20ని గెలవాలన్న పట్టుదలతో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనర్ గా బరిలోకి దిగారు. రోహిత్ తో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తొలి ఓవర్ లో ఆచితూచి కేవలం 3 పరుగులే చేసిన భారత్.. రెండో ఓవర్లో గేర్ మార్చేసింది. రోహిత్ టాప్ గేర్ లో రెచ్చిపోయాడు. కోహ్లి 3వ బాల్ కు బౌండరీకి తరలించగా.. ఓవర్ చివరి బంతిని రోహిత్ సిక్స్ గా మలిచి ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 34 బంతుల్లో 64 పరుగులు చేశాడు రోహిత్. ఇందులో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగి ఆడుతున్న రోహిత్ ను ఔట్ చేసేందుకు బెన్ స్టోక్స్ ఎన్నో ప్రయోగాలు చేస్తూ స్పీడ్ ను కాస్త తగ్గించి వేసిన బంతిని అంచనా వేయడంలో రోహిత్ విఫలమై ఔటయ్యాడు. స్పీడ్ తక్కువగా వచ్చిన బంతి రోహిత్ బ్యాట్ అంచులకు తాకుతూ వికెట్లను గిరాటేసింది.
10 ఓవర్లకు 110 స్కోర్
రెండో ఓవర్ నుండే టాప్ గేర్ వేసి జోరు పెంచిన భారత్ 10 ఓవర్లో 100 పరుగులు దాటేసింది. 10వ ఓవర్ ముగిసే సమయానికి 110 పరుగులు చేసింది. రోహిత్ స్థానంలో బరిలోకి దిగిన సూర్య కుమార్ వచ్చీ రావడంతోనే వరుసగా రెండు సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను చితక్కొట్టడంతో స్కోర్ బోర్డు చకచకా పరుగులు పెట్టింది. 12వ ఓవర్ తొలి బంతికి కోహ్లి ఫోర్ కొట్టి జోరు కంటిన్యూ చేయగా.. కెప్టెన్ ప్రోత్సాహంతో సూర్య కుమార్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో ఇంగ్లండ్ పేస్ బౌలర్లు వికెట్లపై ఆశలు వదులుకుని స్పీడ్ ను తగ్గించి లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు.
జోర్డాన్ స్టన్నింగ్ క్యాచ్
చివరి టీ20లో శుభారంభం చేసిన భారత జట్టుపై ఇంగ్లండ్ ఏ దశలోనూ ఆధిక్యం చూపించలేకపోయింది. తొలి ఓవర్ తో ఇంగ్లండ్ పొదుపుగా పరుగులివ్వడం ఒక్కటే మినహాయింపు అనుకుంటుండగా.. 13 ఓవర్లో 2 వ బంతికి సూర్యను బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు పంపారు. కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సులతో ధాటిగా ఆడుతున్న సూర్యకుమార్ రషీద్ వేసిన 13.2వబంతిని సిక్సర్ గా మలిచేందుకు గాలిలోకి లేపాడు. అయితే బౌండరీ లైన్ వద్ద జోర్డాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన రీతిలో ఒంటి చేతితో క్యాచ్ అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతున్నానని గుర్తించి వెంటనే బంతిని బంతివైపుకు వస్తున్న జేసన్ రాయ్ వైపు విసరడంతో సూర్యకుమార్ నమ్మలేకపోయాడు. అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ పట్టగా.. హార్దిక్ పాండ్య బరిలోకి దిగాడు.
కోహ్లి అర్ధ సెంచరీ
సూర్య కుమార్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన హార్దిక్ పాండ్య కూడా కెప్టెన్ కోహ్లి ప్రోత్సాహంతో చెలరేగిపోయాడు. లూజ్ బాల్ .. టఫ్ బాల్ అని తేడా లేకుండా బ్యాట్ ఝుళిపించాడు. రెండు వికెట్లు కోల్పోయినా.. స్కోర్ రన్ రేట్ ఏ మాత్రం తగ్గకుండా కంటిన్యూ చేస్తూ వచ్చిన కెప్టెన్ కోహ్లి 16 ఓవర్లో అర్థ సెంచరీ మైలురాయి దాటాడు. కేవలం 37 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. అటు తర్వాత ఇంగ్లండ్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చివరి వరకు అదే ఊపు కొనసాగించారు. దీంతో భారత్ 20 ఓవర్లకు 224 పరుగులు చేసింది.