- రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల ఎంపిక
- తొలివిడతగా పాలేరు నియోజకవర్గం కాకరవాయిలో సర్వే పూర్తి
- ఈనెల 15 నుంచి విడతల వారీగా మిగిలిన గ్రామాల్లో సర్వే
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో తరతరాలుగా సాగులో ఉంటున్నా, పాసు పుస్తకాలు అందక ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో 70 చొప్పున రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి, వాటిలో ప్రతి అంగుళాన్ని సర్వే చేసి సాగులో ఉన్న వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని డిసైడైంది.
రాష్ట్రంలోని 2310 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించనుండగా, నాలుగు విడతల్లో పూర్తి చేయనున్నారు. తొలి విడతగా రెవెన్యూ శాఖ మంత్రి సొంత నియోజకవర్గం పాలేరులోని తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో నెల రోజులుగా లేటెస్ట్ టెక్నాలజీ రోవర్లతో సర్వే నిర్వహించారు. రైతుల వారీగా భూములు, రోడ్లు, ప్రభుత్వ భూముల లెక్క తేల్చారు. ఈ సర్వే విజయవంతం కావడంతో మిగిలిన గ్రామాల్లోనూ అదే ప్లాన్ ను అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా 70 రెవెన్యూ గ్రామాలను అధికారులు గుర్తించారు. త్వరలోనే విడతల వారీగా అన్ని గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
కాకరవాయిలో సర్వే సంపూర్ణం...
తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో రీ సర్వే పూర్తికి దాదాపు నెల రోజుల సమయం పట్టింది. ఫీల్డ్ లో ఉన్న భూముల కంటే ఆర్ఎస్ఆర్ లో ఎక్కువ విస్తీర్ణంలో భూములు ఉండడం, తాము ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్నా, పట్టా పాసు పుస్తకాలు లేవని ఇటీవల ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటికి ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో రీసర్వేకు మంత్రి ఆదేశించారు. దీంతో మే 10 నుంచి సర్వేయర్లు, జీపీవోలతో కూడిన ఐదు టీమ్ లు రైతుల వారీగా సర్వే పూర్తి చేశారు.
గ్రామంలోని అన్ని రోడ్లు, ప్రజా స్థలాలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సంస్థల భూముల వివరాలను కో ఆర్డినేటర్లతో సహా ఖచ్చితంగా నమోదు చేశారు. ప్రతి రైతు పేరు, భూమి విస్తీర్ణం, పూర్తి వివరాలు సేకరించి, ప్రతిరోజూ సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేశారు. తర్వాత ల్యాండ్ పార్శిల్ మ్యాప్ లను సిద్ధం చేశారు. మొదట ఫారం 6 కింద రైతులకు నోటీసులు ఇచ్చి, తర్వాత నిబంధనల ప్రకారం 15 రోజులకు సర్వే ప్రక్రియను చేపట్టారు. క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్డీవో ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి, ఎక్కడైనా అభ్యంతరాలు వస్తే ఆ కమిటీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కమిటీ ఆమోదించిన తర్వాత సర్వేను పూర్తి చేశారు. ఇప్పుడు ల్యాండ్పార్శిల్ మ్యాప్‌తో అందరికీ పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏళ్ల తరబడి భూవివాదాలు..!
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంట రెవెన్యూలో ఏండ్లుగా భూ వివాదాలున్నాయి. ఈ గ్రామంలో రీ సర్వే నిర్వహించాలని ఇప్పటికే కలెక్టర్ దివాకర ఆదేశాలు జారీ చేశారు. తాళ్లపెంట, కర్రలపాడు, బ్రహ్మళ్లకుంట గ్రామాల్లో 1 నుంచి 368 సర్వే నెంబర్ లలో ఉన్న 2,200 ఎకరాల సాగు భూములున్నాయి. సర్వే నెంబర్లకు బై నెంబర్లు వేస్తూ, ఫీల్డ్ లో ఉన్న భూములకంటే పాస్ పుస్తకాల్లో ఎక్కువ విస్తీర్ణంలో భూములు నమోదయ్యాయి. పాసు పుస్తకాల్లో ఒక సర్వే నెంబర్ ఉండగా, ఫీల్డ్ లో మాత్రం వేరే సర్వే నెంబర్లలో రైతులు సాగులో ఉన్నారు. ఆరేళ్ల కింద ఒకసారి నిర్వహించిన సర్వేలో 1125 ఎకరాల్లో భూములు గుర్తించి, పాస్ పుస్తకాలు జారీ చేశారు. మిగిలిన 1,100 ఎకరాల భూములు ఆర్ఎస్ఆర్, అసైన్డ్, ప్రభుత్వ భూములు ఉండటంతో పెండింగ్ లో ఉన్నాయి.
దీనిపై మంత్రి పొంగులేటి ఆదేశాలతో మరోసారి తాళ్లపెంట భూములు మొత్తం మరోసారి రీ సర్వే చేయాలని నిర్ణయించారు. 5 ఎకరాల లోపు భూమి ఉండి, తాతల కాలం నుంచి భూములు సాగులో ఉన్న వారికే ల్యాండ్ పార్శిల్ మ్యాప్ తో భూదార్ నెంబర్ కేటాయించి, యాజమాన్యం హక్కులు కల్పించనున్నారు. భూ సమస్యలతో పాటు అటవీశాఖ, ప్రభుత్వ భూములకు శాశ్వత సరిహద్దులు గుర్తించి పరిష్కారం చూపనున్నారు. ఇలా వివాదాలున్న అన్నిచోట్ల రీ సర్వేతో వాటిని పరిష్కరించనున్నారు.
