ప్రతి మూడేళ్లకోసారి నితీశ్ ప్రధాని కావాలనుకుంటడు: అమిత్ షా

ప్రతి మూడేళ్లకోసారి నితీశ్ ప్రధాని కావాలనుకుంటడు: అమిత్ షా
  •     బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి: అమిత్ షా 
  •     ప్రధాని కావాలనే ఆశతోనే నితీశ్​ కాంగ్రెస్, ఆర్జేడీతో కలిశారని ఫైర్ 

లౌరియా(బీహార్): ప్రధానమంత్రి కావాలనే ఆశతోనే కాంగ్రెస్, ఆర్జేడీతో జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేతులు కలిపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన ప్రతి మూడేండ్లకోసారి ప్రధాని కావాలని కలలు కంటుంటారని విమర్శించారు. శనివారం బీహార్ వెస్ట్ చంపారన్ జిల్లాలోని లౌరియాలో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా నితీశ్​పై నిప్పులు చెరిగారు. ‘‘రాజకీయ జీవితంలో మొదటినుంచీ జంగిల్ రాజ్​కు వ్యతిరేకంగా పోరాడి న నితీశ్.. ఇప్పుడు ఆ జంగిల్ రాజ్​కు ఆద్యులైన లాలూ, సోనియాగాంధీ పంచన చేరారు. వికాసవాది నుంచి నితీశ్ అవకాశవాదిగా మారిపోయారు” ఆయన విమర్శించారు. ‘‘ఆయా రామ్.. గయా రామ్ ఇక చాలు. ఇక నితీశ్​తో దోస్తీ ఉండదు. ఆయనకు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి” అని చెప్పారు. ‘‘జేడీయూ, ఆర్జేడీ పొత్తు ఆయిల్, వాటర్ కలయికలాంటిది. అవి ఎన్నటికీ కలవవు. ఆయిల్​లాగా ఆర్జేడీపైకి తేలితే, వాటర్ లాగా జేడీయూ అదృశ్యమవుతుంది” అని అన్నారు. ‘‘ఆర్జేడీతో పొత్తు సమయంలో నితీశ్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. తేజస్వీ యాదవ్​ను సీఎం చేస్తానని లాలూకు మాటిచ్చారు. మరి నితీశ్ ఆ మాట నిలబెట్టుకుంటారా? మళ్లీ రాష్ట్రంలో జంగిల్ రాజ్ తేవాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు. లాలూ, నితీశ్ బీహార్ ను అభివృద్ధి వైపు నడిపించరని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు.