సర్పంచ్​పై అవినీతి ఆరోపణలు

సర్పంచ్​పై అవినీతి ఆరోపణలు

కోరుట్ల రూరల్, వెలుగు​: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామ సర్పంచ్ పిడుగు రాధసందయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో జగిత్యాల డీపీఓ నరేశ్, డీఎల్పీఓ శంకర్, ఎంపీడీవో నీరజ శుక్రవారం విచారణ చేపట్టారు. సర్పంచుపై ఫిర్యాదు చేయడానికి పెద్దఎత్తున గ్రామస్థులు పంచాయతీకి తరలివచ్చారు. అధికారులు పోలీసుల సహాయం తీసుకుని గ్రామస్థులను అదుపు చేశారు. సర్పంచ్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామాభివృద్ధికి రూ. ఐదు కోట్లకు పైగా నిధులు వచ్చాయని, అందులో దాదాపు రూ. 1.09 కోట్లు దుర్వినియోగం చేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఉపాధి హామీ పనుల్లో గోల్​మాల్​చేయడంతో పాటు సొంత పనులు చేయించుకుని తమకు డబ్బులు ఇవ్వలేదని కొందరు ఉపాధి హామీ కార్మికులు గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసి రావాల్సిన డబ్బులు ఇప్పిస్తామని డీఎల్పీఓ శంకర్ హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు.

గ్రామంలో అభివృద్ధి పనులను సర్పంచ్ భర్త, కుటుంబసభ్యులు, బినామీల పేరుతో చేసి నిధులు మింగేశారని ఆరోపించారు. కోరుట్ల తహసీల్దార్ సూచన మేరకు గ్రామస్థులు కొందరు స్వచ్ఛందంగా గ్రామంలో మొరం పోశారని, సర్పంచ్ భర్త సందయ్య గ్రామపంచాయతీ కార్యదర్శితో కలిసి ఎవరికి తెలియకుండా వారే మొరం పోయించినట్లు రూ. మూడు లక్షలు డ్రా చేసుకున్నారని, వాటర్ ట్యాంకర్ కు కొన్నట్టుగా నకిలీ బిల్లులు చూపించి నిధులు స్వాహా చేశారని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ సందర్భంగా 9 అంశాలపై వందల ఫిర్యాదులు రావడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు.