- బస్ డిపో ఎదుట మాజీ మంత్రి జోగురామన్న బైఠాయింపు, అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: రంగు మారిన సోయా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బస్ డిపో ఎదుట మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పార్టీ నాయకులతో కలిసి బైఠాయించగా, పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 5 గంటల నుంచి బస్ డిపో ముందు బైఠాయించి బస్సులను అడ్డుకోవడంతో డీఎస్పీ జీవన్‌రెడ్డి అక్కడికి చేరుకొని వారిని సముదాయించినప్పటికీ వినకపోవడంతో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూసి వేయించారు. పలువురు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ రైతులు పండించిన సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నాఫెడ్, మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, నాయకులు యాసం నర్సింగ్‌రావు, పట్టణ అధ్యక్షుడు అజయ్, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లా ద్, యూనుస్ అక్బానీ, జోగు మహేందర్, గండ్రత్ రమేశ్, సాజిదోద్దీన్ పాల్గొన్నారు.
