గద్వాల, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం 2026-27 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వడ్ల కొనుగోళ్లపై సంబంధిత ఆఫీసర్లతో సన్నాహక మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వడ్లు ఇక్కడి కొనుగోలు కేంద్రాలకు రాకుండా కట్టడి చేయాలన్నారు. అవకతవకలకు పాల్పడే మిల్లర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు కేంద్రాల వద్ద లేని ఇన్-ఛార్జ్ లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల టీచర్లు ఆంగ్ల భాషలో ప్రతిభ చాటేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 35 రోజుల ఆన్‌లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
