ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పనులు ఇంకా మొదలుకాలె

ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పనులు ఇంకా మొదలుకాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో  వివిధ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ పనులు ఇంకా మొదలు కాలేదు. ఏయే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఏ వర్సిటీకి అప్పగించాలనేదానిపై స్పష్టత రాలేదు. దీంతో ప్రవేశ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నది. ఇంజినీరింగ్, ఫార్మ సీతో పాటు వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఏటా మే, జూన్ నెలల్లో ప్రవేశ పరీక్షలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్వహిస్తుంటుంది. ఇందుకు ఏటా డిసెంబర్ నుంచే ప్రక్రియ మొదలవుతోంది. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీఎల్​ సెట్, పీఈసెట్ తదితర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహణకు కౌన్సిల్ అధికారులు వివిధ యూనివర్సిటీలకు లేఖలు రాసి వారి నుంచి అభిప్రాయలు, ప్రతిపాదనలు తీసుకుంటారు. అనంతరం పరీక్షలు నిర్వహించే సామర్థ్యం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని, వర్సిటీలకు ఆయా సెట్స్​ను నిర్వహించేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనుమతి ఇస్తుంటుంది. ఆపై వర్సిటీ అధికారులు సెట్ కమిటీ వేసుకొని, షెడ్యూల్ ఇతర ప్రక్రియలు నిర్వహిస్తారు. అయితే, ఈ సంవత్సరం డిసెంబర్ గడిచిపోతున్నా సెట్స్ నిర్వహణపై మాత్రం ఎలాంటి ప్రక్రియ ప్రారంభం కాలేదు.

పోస్టులపై గందరగోళంతోనే.. 

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ పోస్టులపై కొంత గందరగోళం నెలకొనడంతో ఈ సమస్య ఏర్పడింది. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లను తొలగిస్తూ సర్కారు జీవో ఇవ్వగా, వాటిలో వీరిద్దరి పేర్లూ ఉన్నాయి. అయితే, రిఫ రెన్స్ జీవోలు వేరుగా ఉండటంతో, వారు సర్కారు పెద్దల ను కలిసి క్లారిటీ కోరారు. అయితే, సర్కారు నుంచి స్పష్ట త వచ్చే వరకూ బాధ్యతల్లో కొనసాగాలని వారికి సూచించినట్టు తెలిసింది. అయినా, వారిద్దరు కౌన్సిల్​కు సరిగా రావడం లేదు. దీంతో ప్రవేశపరీక్షల పనులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని, ప్రవేశపరీక్షల ఏర్పాట్లు స్టార్ట్​చేయాలని  విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు. లేకపోతే,  ఎంట్రె న్స్ ఎగ్జామ్స్ ఆలస్యమవుతాయని చెప్తున్నారు. 
===========================================================================