పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మొత్తం డబ్బు తీసుకోవడానికి EPFO ఓకే

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మొత్తం డబ్బు తీసుకోవడానికి EPFO ఓకే
  • 13 రూల్స్ సడలింపు
  • ఈపీఎఫ్‌‌‌‌ విత్‌‌‌‌డ్రాలపై కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ:ఈపీఎఫ్‌‌‌‌ఓ తన ఏడు కోట్లకు పైగా చందాదారుల కోసం విత్‌‌‌‌డ్రాల నిబంధనలను సడలిచింది. ఇక నుంచి అర్హత కలిగిన బ్యాలెన్స్​లో 100 శాతం వరకు విత్‌‌‌‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. విత్​డ్రాయల్స్​కోసం విధించిన 13 నిబంధనలను అవసరాలు (జబ్బులు, పెళ్లి, చదువు), గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా మార్చింది. విత్‌‌‌‌డ్రాలకు కనీస సర్వీస్ అవసరాన్ని 12 నెలలకు తగ్గించింది. 

ప్రత్యేక పరిస్థితుల్లో ఎటువంటి కారణమూ చూపకుండా డబ్బు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ కార్పస్‌‌‌‌ను కాపాడుకునేందుకు ఖాతాలో 25 శాతం కనీస బ్యాలెన్స్ ఉంచాలి. దీనితో వడ్డీ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పెండింగ్ కేసులను తగ్గించేందుకు 'విశ్వాస్ స్కీమ్' ను కూడా ప్రవేశపెట్టారు. దీనివల్ల పెనాల్టీలు గణనీయంగా తగ్గుతాయి.  ఈపీఎఫ్‌‌‌‌ఓ ఈ–-ప్రొసీడింగ్స్ పోర్టల్ కింద దాదాపు 21 వేల కేసులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.  

ఈ పథకం ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది, దానిని మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం కూడా ఉంది. 'విశ్వాస్ స్కీమ్' నిబంధనలను పాటిస్తే, పెండింగ్‌‌‌‌లో ఉన్న అన్ని కేసులూ రద్దు అవుతాయి.ఈపీఎస్ 95 పెన్షనర్లకు ఉచితంగా డోర్‌‌‌‌స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవలను అందించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) తో ఈపీఎఫ్‌‌‌‌ఓ ఒప్పందం చేసుకుంది.

ఉద్యోగుల నమోదు పథకం ప్రారంభం

ఉద్యోగులకు సామాజిక భద్రత కవరేజీని విస్తరించడానికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 'ఉద్యోగుల నమోదు ప్రచార పథకం, 2025' (ఈఈసీ) ను ప్రకటించింది. ఈ పథకం నవంబర్  నుంచి 2026  ఏప్రిల్ 30 వరకు అమలు అవుతుంది. ఈపీఎఫ్‌‌‌‌ చట్టం పరిధిలోకి వచ్చే కొత్త, పాత యజమానులు తమ అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేయడానికి ఈ పథకాన్ని రూపొందించారు. 

2017 జులై –2025 అక్టోబర్ 31 మధ్య ఉద్యోగంలో చేరి, గతంలో ఈపీఎఫ్‌‌‌‌ పథకంలో నమోదుకాని ఉద్యోగులను యజమానులు చేర్చవచ్చు. ఈ పథకం కింద యజమానులకు ఒక పెద్ద ఊరట ఏమిటంటే, ఆ గత కాలానికి (జులై 1, 2017 నుంచి అక్టోబర్ 31, 2025 వరకు) ఉద్యోగి వాటా పీఎఫ్ చెల్లింపులకు మినహాయింపు లభిస్తుంది. యజమాని తమ వాటా మొత్తాన్ని మాత్రమే చెల్లించాలి. నిబంధనలను పాటించనందుకు సాధారణంగా విధించే భారీ జరిమానాలకు బదులుగా, కేవలం రూ. 100 మాత్రమే నామమాత్రపు జరిమానాగా చెల్లించాలి.