సెక్యులర్‌గానే ఉంటం : క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్

సెక్యులర్‌గానే ఉంటం : క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్

అన్ని మతాలకు సమాన ఆదరణ.. సంక్షేమ పథకాలు
సమస్యల పరిష్కారానికి కులం, మతం అడ్డుగోడలు కావు
సంక్షేమంలో దేశంలోనే ముందున్నామని వెల్లడి
క్రిస్టియన్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగురాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ఆదరణ ఉంటుందని, వందకు వంద శాతం సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్​ చెప్పారు. అన్ని మతాల పండుగలను సమానంగా జరుపుకొంటామని, పరస్పరం అభినందించుకుంటామని తెలిపారు. అన్ని వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్​ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘పండుగలను సెలబ్రేట్ చేసుకునే గుణం, సహనం, మనుషులను మనుషులుగా ప్రేమించగలిగే తత్వం ఉంటే సమాజం ఏవిధంగా ఉంటుందనే దానికి నా రాష్ట్రం తెలంగాణ గొప్ప ఉదాహరణ. ఒకటి కచ్చితంగా చెప్పగలను, కొందరికి అభ్యంతరాలు ఉండవచ్చు.

కానీ రాష్ట్రాన్ని వందశాతం సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకుపోతున్నం. ఏ పండుగ వచ్చినా తేడా లేదు. ఇక్కడి ప్రజల జీవనం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇదే గ్రౌండ్​లో ఇఫ్తార్, బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్ వేడుకలు అన్నీ నిర్వహించుకుంటం. పరస్పరం అభినందించుకుంటం”అని కేసీఆర్​ చెప్పారు. పక్కా క్రిస్టియన్‌‌‌‌ దేశానికి వెళ్లినా ఒకట్రెండే పండుగలు ఉంటాయని, ఇస్లామిక్‌‌‌‌ దేశానికి వెళ్లినా, హిందూ దేశమైనా అట్లానే ఉంటాయని పేర్కొన్నారు. కానీ దేశంలో అన్ని మతాల పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటమని, భారతదేశం రంగ్​ బిరంగ్​ దేశమని చెప్పారు.

సంక్షేమంలో ముందున్నం

రాష్ట్రంలో తాగునీటి సమస్య శాశ్వతంగా తొలగిపోయిందని సీఎం కేసీఆర్​ అన్నారు. గతంలో ఉన్న బాధలు ఇప్పుడు లేవని, విద్యుత్ సరఫరాలో సమస్యలు తొలగిపోయాయని చెప్పారు. పేదల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందున్నదన్నారు. మన రాష్ట్రం సాధించిన గొప్ప విజయం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమని.. 20 ఏండ్లకుపైగా పట్టే పనులను మూడేండ్లలోనే పూర్తి చేశామని తెలిపారు. వచ్చే జూన్ నుంచి ఈ ప్రాజెక్టు ఫలాలను మన రైతాంగం అనుభవిస్తుందని.. 70 నుంచి 75 లక్షల ఎకరాలు సాగు చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

క్రిస్టియన్ల కోసం పథకాలు..

రాష్ట్రంలో క్రిస్టియన్లకు అందరితోపాటు ఓవర్‌‌‌‌సీస్‌‌‌‌ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌, ఓన్‌‌‌‌ యువర్‌‌‌‌ కార్‌‌‌‌, స్కాలర్‌‌‌‌ షిప్‌‌‌‌లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌, షాదీ ముబారక్‌‌‌‌ వంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయని సీఎం కేసీఆర్​ చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కులం, మతం అడ్డుగోడలు కావని అన్నారు. ప్రజల అవసరాలు, పేదరికం మాత్రమే ప్రాతిపదికగా పనులు జరుగుతాయని చెప్పారు. బిషప్‌‌‌‌ తుమ్మ బాలకు, క్రిస్టియన్​ పెద్దలకు పదిపదిహేను రోజుల్లో అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇస్తామని.. సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రులు మహమూద్‌‌‌‌ అలీ, తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ఇంద్రకరణ్‌‌‌‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌‌‌‌, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేతుల మీదుగా పలువురికి అవార్డులు అందించారు.