సెన్సెక్స్​ 1 శాతం డౌన్ .. 216 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

సెన్సెక్స్​ 1  శాతం డౌన్ .. 216 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ముంబై: డెరివేటివ్స్​ నెలవారీ గడువు ముగియనున్న నేపథ్యంలో మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్​తో పాటు కొన్ని ఐటీ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఈక్విటీ ఇండెక్స్​లు సెన్సెక్స్,  నిఫ్టీలు గురువారం దాదాపు 1 శాతం చొప్పున పతనమయ్యాయి. 30 షేర్ల బీఎస్​ఈ సెన్సెక్స్ 617.30 పాయింట్లు క్షీణించి 73,885.60 వద్ద స్థిరపడింది. బ్లూ-చిప్‌‌‌‌‌‌‌‌ షేర్లలో అమ్మకాల కారణంగా ఈ బ్యారోమీటర్ రోజు కనిష్ట స్థాయి 73,668.73కి చేరుకుంది. గత ఐదు రోజులలో ఇది 1,532 పాయింట్లు పడిపోయింది. 

మే 23 నుంచి జీవితకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసినప్పటి నుంచి ఇండెక్స్ డౌన్ ట్రెండ్‌‌‌‌‌‌‌‌లో ఉంది.  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 216.05 పాయింట్లు క్షీణించి 22,488.65 వద్ద ముగిసింది. గురువారంతో ముగిసిన ఐదు సెషన్లలో సూచీ 479 పాయింట్లు నష్టపోయింది.  వచ్చే వారం ప్రకటించనున్న 2024  ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారని ఎనలిస్టులు తెలిపారు.    సెన్సెక్స్ ప్యాక్ నుంచి, టాటా స్టీల్, టైటాన్, టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, జేఎస్​డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి. అయితే,  ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్, ఎస్​బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడ్డాయి. 

సెన్సెక్స్,   నిఫ్టీ వరుసగా ఐదవ సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా పెట్టుబడిదారులు దాదాపు రూ.10 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.   ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లలో బ్యాంకెక్స్ మాత్రమే లాభపడింది. ఫలితాలు బాగాలేకపోవడంతో టాటా స్టీల్ దాదాపు 6 శాతం పడిపోయింది. అయితే, కో–-వర్కింగ్ స్పేస్ ఆపరేటర్ ఆఫిస్​ స్పేస్ సొల్యూషన్స్ షేర్లు ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌లో తొలి ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌లో 9 శాతం కంటే ఎక్కువగా లాభపడ్డాయి.  ఇదిలా ఉంటే అమెరికా జీడీపీ మార్చి క్వార్టర్​లో 1.3 శాతం పెరిగింది. ప్రభుత్వం వేసిన అంచనా 1.6 శాతం కంటే ఇది తక్కువ. కన్జూమర్​ స్పెండింగ్​ తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.