
- ప్రభుత్వ సబ్సిడీ రూ.11,499.52 కోట్లు
- గతంలో కంటే రూ.2,374.7 కోట్లు అధికం
- పేదలపై కరెంటు బిల్లుల భారం లేదు..
- మినిమమ్ చార్జీలు రూ.30 పెంపునకు ఈఆర్సీ నో
- 801 యూనిట్లు దాటితే స్వల్ప పెంపు
- వీళ్లకు ఫిక్స్డ్ చార్జీ రూ.10 నుంచి రూ.50కి హైక్
- అధిక ఓల్టేజీ వాడే ఇండస్ట్రీలకు రూ.25 పెంపు కోసం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: సామాన్యులపై ఎలాంటి విద్యుత్ భారం మోపొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విద్యుత్ చార్జీలు ఏ కేటగిరిలోనూ పెంచడం లేదు. ఫిక్స్డ్ చార్జీలు రూ.10 యాథాతథంగా ఉండనున్నాయి. వచ్చే 5 నెలలు పాటు అమలయ్యే విద్యుత్ టారిఫ్‌లో ఏ కేటగిరీలోనూ విద్యుత్ చార్జీలు పెంచకుండా యాథాతథంగా అమలు చేయాలని విద్యుత్ సంస్థలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఆదేశించింది. అయితే, వ్యాపార, వాణిజ్య కేటగిరీల్లో 800 యూనిట్లు దాటిన గృహ వినియోగదారుల ఫిక్స్డ్ చార్జీలు మాత్రం స్వల్పంగా పెంచారు.
2024 నవంబర్ 1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకే కొత్త చార్జీలు వర్తిస్తాయని ఈఆర్సీ ప్రకటించింది. డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.11,499.52 కోట్లు సబ్సిడీ చెల్లించేందుకు అంగీకరించింది. గతంలో కంటే ఈ యేడు భారీగా చెల్లించేందుకు ఒప్పుకున్నది. దీంతో కరెంట్ చార్జీల టారిఫ్ పెంపు జరగలేదు. కొత్తగా పెంచిన ఫిక్స్డ్ చార్జీలతో విద్యుత్ పంపిణీ సంస్థలకు కేవలం రూ.30 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. సోమవారం డిస్కం వార్షిక టారిఫ్ ప్రతిపాదనలపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించింది. హైదరాబాద్ విద్యుత్ నియంత్రణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు, సభ్యులు ఎఫ్ఏ మనోహారరాజు, బండారు కృష్ణయ్య వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ శాఖల నుంచి రూ.25 వేల కోట్ల బకాయిలు విద్యుత్ సంస్థలకు రావల్సి ఉందనీ, వాటిని వసూలు చేసుకోవాలని డిస్కంలను ఆదేశించినట్టు తెలిపారు.
సర్కారు సబ్సిడీ రూ.2,374.7 కోట్లు పెంచింది
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సదరన్ డిస్కం, వరంగల్ కేంద్రంగా ఉన్న నార్తర్న్ డిస్కంలు రూ.57,728.90 కోట్ల ప్రతిపాదనలు పంపించగా ఈఆర్సీ రూ.54,183.28 కోట్లకు ఆమోదం తెలిపింది. విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ లోటును రూ.11,499.52 కోట్లుగా నిర్ధారించగా, ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. గతంలో కంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,374.7కోట్లను అదనంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నది. సర్కారు 28 శాతం సబ్సిడీ పెంచిన ఫలితంగా ప్రజలపై అదనపు భారం తగ్గినట్టయింది. కాగా, 301 యూనిట్ల నుంచి 800 యూనిట్లలోపు వాడే గృహ వినియోగదారుల ఫిక్స్డ్ చార్జీలను రూ.10 నుంచి రూ.50 కి పెంచాలని విద్యుత్ సంస్థలు కోరగా.. ఈఆర్సీ తిరస్కరించింది.
రూ.10 లను యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. 800 యూనిట్లకు పైగా కరెంటు వాడుకునే గృహ వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీలను రూ.10 నుంచి రూ.50 పెంపునకు అనుమతించింది. 301యూనిట్లకు పైగా వాడే కమర్షియల్ వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీలు రూ.70 నుంచి రూ.150కి పెంచాలని కోరగా.. రూ.100 పెంపునకు ఈఆర్సీ అనుమతించింది. అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్‌లకు ఫిక్స్డ్ చార్జీలు రూ.70 నుంచి రూ.150కి పెంచుకోవడానికి అనుమతించింది. ఎల్టీ–3 ఇండస్ట్రియల్ వినియోగదారుల్లో ఇండస్ట్రియల్, సీజనల్ ఇండస్ట్రియల్ కనెక్షన్లకు ఫిక్స్డ్ చార్జీలు రూ.75 నుంచి రూ.150కి పెంచుకోవాలని కోరగా.. రూ.100కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేపలు, రొయ్యల చెరువులకు , చెరకు ఫ్యాక్టరీలకు రూ.36 నుంచి రూ.100కు పెంచాలని కోరగా.. ఈఆర్సీ తిరస్కరించింది. అదే విధంగా పౌల్ట్రీ ఫామ్‌లకు పెంచడానికి అంగీకరించలేదు. పుట్టగొడుగులు, కుందేళ్లు, గొర్రెలు, మేకల ఫారాలకు రూ.75 నుంచి రూ.150కి పెంచుకోవడానికి అనుమతించాలని కోరగా.. రూ.100కు అనుమతించింది. చేనేత కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలు, నర్సరీలకు ఫిక్స్డ్ చార్జీలు పెంచాలని డిస్కంలు కోరలేదు. ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లకు గతంలో రూ.50 ఫిక్స్డ్ చార్జీలు ఉండగా.. డిస్కంలు వాటిని ప్రోత్సహించేందుకు జీరో చేయాలని కోరగా.. చార్జీలను రద్దు చేసింది.
అధిక ఓల్టేజీ వాడే ఇండస్ట్రీల్లో 25 పెంపునకు గ్రీన్ సిగ్నల్..
అధిక ఓల్టేజీ వాడే ఇండస్ట్రీలకు రూ. 25 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా 11 కేవీ, 33 కేవీ పౌల్ట్రీ ఫారాలకు, సీజనల్ఇండస్ట్రీలు, హెచ్టీ –2ఏ, హెచ్టీ–2 అదర్స్ ఫిక్స్డ్ చార్జీలు రూ.475 నుంచి రూ.500కు పెంచుకోవడానికి అనుమతించింది. దేవాలయాలు , ఎయిర్‌పోర్టులు, బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లకు రూ.25 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టౌన్‌షిప్‌లు, రెసిడెన్షియల్ కాలనీలకు రూ.15, అదే విధంగా 11 కేవీ, 33 కేవీ ,132 కేవీ లిఫ్ట్ ఇరిగేషన్ , అగ్రికల్చర్, రైల్వే ట్రాక్షన్, టెంపరరీ వినియోగానికి ఫిక్స్డ్ చార్జీలు రూ.25 పెంచుకునేందుకు అనుమతించింది. అగ్రికల్చర్, హార్టికల్చర్, చేనేత పవర్ లూమ్స్ పంపు సెట్లు, మిషన్లు హార్స్పవర్ పెంచుకునేందుకు అంగీకారం తెలిపింది. అగ్రి, హార్టికల్చర్‌కు 15హెచ్‌పీ నుంచి 20 హెచ్‌పీకి, మిల్స్ 10హెచ్‌పీ నుంచి 20హెచ్‌పీకి పెంచుకునేందుకు అనుమతించింది.