హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి, అభద్రత భావానికి గురిచేస్తున్నారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరు వల్ల 20 మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలను పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ దొరఅహంకారాన్ని వీడాలని, కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మెపై జోక్యం చేసుకోవాలని కోరారు. కార్మికుల బలిదానాలకు క్షమాపణ చెప్పకుండా, దాన్ని ఇతరుల మీదికి నెట్టివేయడం పాలకుడి లక్షణం కాదన్నారు. మోటారు వాహన చట్టం అమలులో భాగంగానే విధిలేక ప్రైవేటీకరణ చేస్తున్నామని ముచ్చట్లు చెప్పుడు సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయలేదెందుకని నిలదీశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడంలో భాగంగా 50 శాతం రూట్లకు పర్మిట్లు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
