
- నేటి నుంచి వారం రోజులపాటు ఉత్సవాలు
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజాపూర్లో ఎరుకల నాంచారమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకలకు నాలుగు రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు ఎరుకల కులస్తులు అన్ని ఏర్పాట్లు చేశారు.
800 ఏండ్ల క్రితం ఆలయ నిర్మాణం..
కాకతీయుల కాలంలో రామప్ప దేవాలయంతోపాటు రామానుజాపూర్ సమీపంలోని పంట పొలాల్లో 800 ఏండ్ల క్రితం ఎరుకల నాంచారమ్మ (పంచకూటాలయం) ఆలయం నిర్మించారు. అరుదైన నల్లసేనపురాయితో చెక్కబడిన ఐదు శివలింగాలను ఇతర అద్భుతమైన శిల్పాలను పునర్నిర్మాణం పేరుతో పురావస్తు శాఖ అధికారులు రామానుజపూర్ సమీపానికి తరలించారు.
తర్వాత పట్టించుకోకపోవడంతో తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు కులస్తులను ఏకం చేసి 2018 నుంచి నాంచారమ్మ జాతర నిర్వహిస్తున్నారు. నేడు వేద పండితుల సమక్షంలో జాతరతోపాటు నాంచారమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సవాలకు తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని ఎరుకల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు కోరారు.
నాలుగు రాష్ర్టాల నుంచి తరలిరానున్న భక్తులు
వైవిధ్యమైన జీవన విధానం కలిగిన ఎరుకల కులస్తులు జాతరలో సందడి చేయనున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు ప్రతి ఏడాది ఎరుకల కులస్తులు తరలివస్తున్నారు. కాగా, మొదటి రోజు జాతరలో వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట నుంచి డప్పుచప్పుళ్లు, నాంచారమ్మ, ఏకలవ్యుడి వేషధారణలతో రామానుజాపూర్ వరకు తరలివస్తారు. ఎరుకల కులస్తులు ఆచారాల ప్రకారం నాంచారమ్మకు బోనంతో మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రముఖులకు ఆహ్వానం..
అంతకుముందు తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు లోకిని రాజు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆహ్వాన పత్రికలు అందజేయగా, ఆదివారం తహసీల్దార్గిరిబాబు, ఎస్సై జక్కుల సతీశ్‌ను జాతరకు ఆహ్వానించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లింగాల రమణారెడ్డి తెలిపారు. కాగా, నాంచారమ్మ జాతరకు ప్రముఖులు రానుండడంతో స్థానిక ఎస్సై సతీశ్ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.