నిద్రలో ఉంచి..మార్స్ కు పంపుతరంట!

నిద్రలో ఉంచి..మార్స్ కు పంపుతరంట!

అవతార్ సినిమా చూశారా? అందులో భూమికి దూరంగా ఉన్న పాండోరా అనే గ్రహంపైకి హీరో, ఇతరులను చల్లని లిక్విడ్‌‌లో దీర్ఘనిద్రలో ఉంచి పంపుతారు. అది క్రయోస్లీప్ టెక్నిక్. పూర్తిగా కల్పితం. కానీ.. ఇంచుమించు ఇలాంటి టెక్నిక్‌‌నే ఎప్పటికైనా సాధించి తీరాలని సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆస్ట్రోనాట్‌‌లను రోజులు, నెలల తరబడి హైబర్నేషన్ (దీర్ఘనిద్ర)లో ఉంచే విషయంలో ఉన్న చిక్కుముడులను విప్పడంపై తాము దృష్టి పెట్టామని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సైంటిస్టులు చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే సుదూర అంతరిక్ష యాత్రల సీన్లను నిజం చేస్తామని వారు అంటున్నారు.

హైబర్నేషన్ అంటే..?

రోజులు, నెలల తరబడి గాఢమైన నిద్రలో ఉండటాన్నే హైబర్నేషన్ అంటారు. సాధారణంగా మంచు ప్రాంతాల్లోని చాలా జంతువులు చలికాలంలో మూడు, నాలుగు నెలలపాటు హైబర్నేషన్‌‌లోకి వెళతాయి. చలికాలం పోయాక తిరిగి మేలుకుని, మామూలు జీవితం కొనసాగిస్తాయి. చల్లటి వాతావరణంలో హైబర్నేషన్‌‌లోకి వెళ్లడం వల్ల శరీరంలోని అన్ని జీవక్రియలు చాలా తక్కువస్థాయికి పడిపోతాయి. శరీరానికి ఆహారం, నీటి అవసరాలు పెద్దగా ఉండవు.

స్పేస్ ట్రావెల్ ఈజీ..

ప్రస్తుత టెక్నాలజీతో భూమి నుంచి మార్స్‌‌కు వెళ్లాలంటే సుమారుగా 6 నుంచి 9 నెలలు పడుతుంది. ఇన్ని నెలలు ఆస్ట్రోనాట్లు రేడియేషన్, టెంపరేచర్లు, స్పేస్ ప్రెజర్‌‌ను తట్టుకుంటూ ప్రయాణించాలంటే ఎంతో రిస్క్ ఉంటుంది. అలాగే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదంతో పాటు వారికి ఫుడ్, వాటర్ అవసరమూ పెరుగుతుంది. అందుకే జంతువుల్లాగా ఆస్ట్రోనాట్లను హైబర్నేషన్ లోకి పంపి.. మార్స్‌‌కు చేరుకునే ముందు తిరిగి హైబర్నేషన్ నుంచి క్రమంగా బయటికి రప్పిస్తే.. సురక్షితంగా ఉంటారని, ఖర్చు, వనరులు కూడా ఆదా అవుతాయని అంటున్నారు.

ఆరుగురిని పంపేందుకు ప్లాన్..

ఆస్ట్రోనాట్‌‌లను హైబర్నేషన్‌‌లో ఉంచి మార్స్‌‌కు పంపేందుకు స్పేస్ క్రాఫ్ట్‌‌ను చాలా ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది. వారికి కావల్సిన సరుకులు, వస్తువులన్నింటినీ సర్దటంతోపాటు రేడియేషన్ నుంచి రక్షణ కల్పించేందుకు, స్పేస్ క్రాఫ్ట్ కు ఇంధనం కోసం పర్​ఫెక్ట్ డిజైన్ అవసరమవుతుందని ఈఎస్ఏ సైంటిస్టులు వెల్లడించారు. అయితే, ముందుగా జంతువుల మీద ప్రయోగాలు చేసిన తర్వాతే మనుషులపై ప్రయోగాలను చేపట్టాల్సి ఉంటుందని వారు తెలిపారు. జంతువులు హైబర్నేషన్ లోకి వెళ్లి, తిరిగి మేలుకునేటప్పుడు ఒక్కసారిగా కాకుండా, క్రమంగా జీవక్రియల రేటు పెరుగుతాయని, మనుషుల్లోనూ ఈ ప్రక్రియను చివరి 21 రోజుల పాటు కరెక్ట్ గా చేయాల్సి ఉంటుందన్నారు. మొత్తంగా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేందుకు మరో 20 ఏండ్లు పట్టవచ్చని ఈఎస్ఏ కాన్ కరెంట్ డిజైన్ ఫెసిలిటీ సైంటిస్ట్ రాబిన్ బీస్బ్రోక్ వెల్లడించారు.

హైబర్నేషన్ లోకి  ఎట్ల పంపుతరు?

సినిమాల్లో చూపినట్లు క్రయోస్లీప్, సస్పెండెడ్ యానిమేషన్ లాంటి కల్పిత పద్ధతులు కాకుండా నిజజీవితంలో ఇప్పటికే ఉపయోగిస్తున్న థెరపిటిక్ హైపోథర్మియా అనే టెక్నిక్‌‌ను ఉపయోగించి మనుషులను హైబర్నేషన్‌‌లోకి పంపవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల మెదడు పనిచేయకుండా ఆగిపోయే సందర్భాల్లో పేషంట్ల బాడీ టెంపరేచర్‌‌ను 36 డిగ్రీల  నుంచి 32 డిగ్రీల దాకా తగ్గించడమే ఈ టెక్నిక్‌‌.  ఈ టెక్నిక్ ను మరింత మెరుగుపర్చడం ద్వారా మనుషులను హైబర్నేషన్ లోకి పంపవచ్చని చెబుతున్నారు.