బీజేపీపై ఈశ్వరప్ప తిరుగుబాటు

బీజేపీపై ఈశ్వరప్ప తిరుగుబాటు
  •  యడియూరప్ప కొడుకుపై ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని వెల్లడి

బెంగళూరు:  కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం కేఎస్  ఈశ్వరప్ప బీజేపీపై తిరుగుబావుటా ఎగరేశారు. మాజీ సీఎం బీఎస్  యడియూరప్ప కొడుకు, శివమొగ్గ సిట్టింగ్  ఎంపీ బీవై రాఘవేంద్రపై ఆ స్థానం నుంచి ఇండిపెండెంట్​గా పోటీచేస్తానని గురువారం ఒక ప్రకనటలో  స్పష్టం చేశారు. తనను కలవడానికి ఢిల్లీ వచ్చిన ఈశ్వరప్పకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్  ఇవ్వకపోవడంతో ఆయన బుధవారం శివమొగ్గకు తిరిగివెళ్లారు. 

అనంతరం రాఘవేంద్రపై శివమొగ్గ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేస్తానని ప్రకటించారు. ‘‘ఇక మాటల్లేవ్. కర్నాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బీవై విజయేంద్ర (యడియూరప్ప మరో కొడుకు) ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలి. అప్పుడే నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాను” అని ఈశ్వరప్ప స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారాలను ఒకే కుటుంబం చెలాయిస్తోందని యడియూరప్ప ఫ్యామిలీపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో పార్టీని నియంత్రిస్తున్న ఒక కుటుంబంపైనే తన పోరాటమని చెప్పారు. 

‘‘కాంగ్రెస్ లో ఫ్యామిలీ కల్చర్  ఉందని ప్రధాని మోదీ విమర్శిస్తూ ఉంటారు. రాష్ట్రంలోనూ అలాగే ఉంది. ఇక్కడ ఒక కుటుంబమే పార్టీని తన చెప్పుచేతల్లో పెట్టుకుని అధికారం చెలాయిస్తోంది. యడియూరప్ప కుటుంబం నుంచి బీజేపీకి విముక్తి కల్పించాలి. హిందుత్వ భావజాలం, పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలను గౌరవించాలి. ఇది జరగాలంటే శివమొగ్గ నుంచి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. రాష్ట్రంలో పార్టీని ప్రక్షాళించాల్సిన అవసరం ఉందని నా కొడుకు కూడా చెప్పాడు” అని ఈశ్వరప్ప పేర్కొన్నారు.