
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, యాస, భాషను ప్రపంచానికి చాటే ప్రయత్నంలో వీ6 ఛానెల్, వెలుగు పేపర్ ముందు నుంచి మొదటి వరుసలో ఉన్నాయి. వీ6 ఛానల్ చేసిన బతుకమ్మ పాటలు అశేష జనాల మనసులకు హత్తుకున్నాయి. తెలంగాణ ఆడపడుచులకు దగ్గరయ్యాయి. బతుకమ్మ సంస్కృతిని ప్రపంచానికి చాటాయి. అలా 2013 నుంచి 2019 వరకు బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా పాటలను రిలీజ్ చేసింది వీ6 ఛానెల్. ప్రతి పాటలో తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగ విశిష్టత, మన యాసను చూపించే ప్రయత్నం చేసింది. ఈ పాటలను ‘‘V6 News Telugu”యూట్యూబ్ ఛానెల్‌లో చూడొచ్చు.
2013లో..
ప్రకృతి మాత ప్రతి గడపకు గౌరమ్మై వచ్చునంట...
రావనా ఉయ్యాలో.. సిరి దీవెనా ఉయ్యాలో!
పడతుల చేతుల్లో తాను.. పసిపాపై పెరుగునంట...
రావనా ఉయ్యాలో... సిరి దీవెనా ఉయ్యాలో!
2014లో..
పుడమి ఎదలపైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మా
ఈ మట్టి బిడ్డల ఇలవేలుపైన.. మా ఇంటి దేవతమ్మా..
గలగలా గాజులా.. పడతులా చేతుల దోసిట్లో వొదిగిపోతావు
పూవుతోని పువ్వు అల్లుకుని ఈ ధరణి వాకిట్లో కొలువు దీరేవు
బతుకమ్మ తల్లిగా సేవలందేవు
2015లో..
చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్కా బతుకమ్మా
దీదీమా బతుకమ్మా.. దామెర మొగ్గల బతుకమ్మా
తంగెడు పువ్వుల తళతళ మెరిసే వాడవాడంతా.. ఓ పూలవనమాయె.. ప్రతి ఊరు చెరువేమో.. ఓ పూలతోటాయె
గూనుగు పువ్వుల మిలమిల మెరిసే వాడవాడంతా.. ఓ పూలవనమాయె.. ప్రతి ఊరు చెరువేమో.. ఓ పూలతోటాయె!!
2016లో..
కోలో కోలో కోల్.. కొమ్మ పూసే కోల్
సుక్కా పొద్దూకే కోల్.. పల్లె లేసే కోల్
వాకిళ్లే ఊడ్చే కోల్.. అలుకేమో సల్లే కోల్
బతుకమ్మ వచ్చింది కోల్.. బాధల్ని మాపుద్ది కోల్!!
2017లో..
భూమిపొరల నుంచి భూలోకమచ్చింది.. తెల్లతెల్ల మబ్బుల్లా తేలాడుతుంటుంది
అగ్గి మంటల్లోనా భగభగమండుద్ది.. గాలి సప్పుల్లోనా గలగల నవ్వుద్ది
పల్లె చెరువుల్లా నీళ్లై పాటలే పాడుద్ది
పంచభూతాల్లోనా బతుకమ్మా.. ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మా
శ్రమజీవి చెమటల్లో బతుకమ్మా.. ఈ మట్టి వాసననిండా బతుకమ్మా
తెలంగాణ జాతి ఆత్మరా బతుకమ్మా.. మాకు బతుకునిచ్చే మా అవ్వరా బతుకమ్మా
మా పిడికిట్ల వరిబువ్వ మెతుకురా బతుకమ్మా..
2018లో..
గరిమళ్ల బతుకుళ్ల గన్నేరుబోయి గౌరీ గౌరమ్మలో...
తీరొక్కపూవై మా గలమకొచ్చె గౌరీ గౌరమ్మలో
ఇగ కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో...
మా చెరువు కట్టై ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో
అగో పులిసేరు చెట్లళ్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో..
ముక్కాలి పీటెక్కి మురిసే బొడ్డెమై గౌరీ గౌరమ్మలో
2018లో..
జిల్లేలమ్మా.. జిల్లేలమ్మా.. జిల్లేలమ్మా.. సందమామ
జిల్లేలమ్మా.. జిల్లేలమ్మా.. జిల్లేలమ్మా.. సందమామ
బంగారమ్మ తంగేడమ్మా..పసుపులూరే సింగిడమ్మా
వెండేనమ్మా గునుగుకొమ్మా పున్నమోలే పూసెనమ్మా
నింగి నీలంపు పరద.. నేలపైన వాగు వరద.. బతుకమ్మ పూల పడవ
యెనెల్లో సాగి నడవ.. నేలమ్మ సిరులు కురువ..
ఊరంతా కొలువు గొలువ
2019లో ..
ఊరు ఊరే పూల డొంక..
పారే వాగే సెంద్ర వంక
పాల జొన్న తేనెలొలుక
పాల పిట్ట వాలి కులుక
ఓ... రివ్వు రివ్వున తిరిగే గిరక
జామ కొరికే రామ చిలుక
నేల చూపులు నింగివంక
ఎగిరి దుంకే వాన జింక