
ఏది పట్టినా ప్లాస్టిక్. ఎక్కడ చూసినా ప్లాస్టిక్. అది లేనిదే జీవితం లేదన్నట్టుగా తయారైంది పరిస్థితి. మరి, దానికి ప్రత్యామ్నాయాలు లేవా? అంటే.. ఎందుకు లేవు. ఉన్నాయి. పేపర్, జూట్. అవీ బ్యాగుల వరకే పరిమితం. మరి, మిగతా వాటికి!? దానికి వెదురు బొంగులే ప్రత్యామ్నాయం అంటోంది రాష్ట్ర ఉద్యానవన శాఖ. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురును ప్రోత్సహించేలా వెదురు వనాల ఏర్పాటుకు ఆ శాఖ కసరత్తులు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 8.3 లక్షల వెదురు మొక్కలను పెంచేందుకు రెడీ అవుతోంది. వెదురు మొక్కల పెంపకం, వెదురు ఆధారిత కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం ఏర్పాటైన నేషనల్ బాంబూ మిషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఇందులో భాగంగా ₹11కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఉద్యానశాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించి పంట పొలాల గట్ల వెంట వెదురు మొక్కలను పెంచేలా ప్రోత్సహించాలని భావిస్తోంది. అందుకు ఒక్కో మొక్కను పెంచేందుకు ₹240 చొప్పున ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్యాన శాఖ నడుం బిగించింది. మొక్కకు ₹35 నుంచి ₹40 వరకు ఖర్చు అవుతుంది. దానిని నాటడం దగ్గర్నుంచి, పెంచడం దాకా ₹240 ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా మొదటి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 30 శాతం, మూడో సంవత్సరం 20 శాతం చొప్పున రైతులకు రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుకు ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా రాయితీ కల్పించాలని నిర్ణయించింది.
ఒక్కసారి నాటితే దశాబ్దాల పాటు దిగుబడి
వెదురు మొక్కను ఒకసారి నాటితే దశాబ్దాల పాటు దిగుబడి వస్తుంది. గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, ప్లాస్టిక్ బాటిళ్లు, చైర్లకు బదులు వెదురుతో చేసిన వస్తువులను ఉపయోగంలోకి తెచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో వెదురుతో చేసిన కేన్ ఫర్నీచర్‌కు మంచి డిమాండ్ ఉంది. సోఫాలు, టీపాయ్‌లు, హ్యాంగింగ్ చైర్లతో పాటు క్యాండిల్ స్టాండ్లు, టోపీలు, పూల కుండీలు, కర్టైన్లు తయారు చేయొచ్చు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లో జనం ఇళ్లలోనే వెదురును పెంచుతుంటారు. మన రాష్ట్రంలోని అడవుల్లో వెదురు లంకలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ తదితర జిల్లాల్లో ఎక్కువగా అవి కనపడుతుంటాయి. గతంలో ఆ వెదురును నరకాలన్నా, తరలించాలన్నా అటవీశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనను తీసేసింది. దీంతో వెదురు సాగుకు అవకాశాలు మెరుగుపడ్డాయని అధికారులు అంటున్నారు. ఈ సాగులో రైతులను భాగస్వాములు చేయడం, వెదురుతో వివిధ రకాల వస్తువుల తయారీలో శిక్షణ ఇవ్వడం, దానిపై ఆధారపడిన కుటుంబాలకు నైపుణ్యాన్ని పెంచడం, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వంటి చర్యలు చేపట్టడం కోసం ప్రభుత్వం వెదురు పెంపకంపై ముందడుగు వేసింది. అవసరమైన వారికి సబ్సిడీ కింద రుణాలూ ఇవ్వననున్నారు. ఈ–మార్కెటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. వెదురు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి, వస్తు తయారీదారుల సంఘాలకు సబ్సిడీపై వెదురు ఇవ్వాలనియోచిస్తున్నారు.