- ఘనంగా ఈశ్వరీ బాయి 107వ జయంతి
- వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేశ్, మాజీ మంత్రి గీతారెడ్డి
పద్మారావునగర్, వెలుగు: మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిన వీరవనిత ఈశ్వరీ బాయి నేటి తరానికి ఆదర్శనీయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఈశ్వరీబాయి 107వ జయంతి కార్యక్రమం సోమవారం మారేడ్ పల్లిలోని ఆమె విగ్రహం వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, ఈశ్వరీ బాయి కుమార్తె, మాజీ మంత్రి గీతా రెడ్డి హాజరై నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీగణేశ్ మాట్లాడుతూ.. 100 ఏండ్ల క్రితమే లింగ వివక్ష, ఆంక్షలను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యసించి, తన కూతురికి విదేశాలలో చదివే అవకాశాన్ని కల్పించిన గొప్ప మహిళ ఈశ్వరీ బాయి అని పేర్కొన్నారు. అంబేద్కర్, సావిత్రి బాయి పూలే స్ఫూర్తితో బాల బాలికల హక్కుల కోసం పోరాడి, 1951లో చిలకలగూడ కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాసేవ ప్రారంభించారని గుర్తుచేశారు.
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, అలాగే మహిళా, బాలల సంక్షేమ కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన సమయంలో బాలికలకు ఉచిత విద్య చట్టం తీసుకువచ్చిన ఘనత ఈశ్వరీ బాయి దేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన ఫైర్‌బ్రాండ్ నాయకురాలు ఆమె అని తెలిపారు. ఆమె వారసురాలు గీతా రెడ్డి కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, పలు కీలక శాఖల మంత్రిగా ప్రజాసేవ చేశారన్నారు.
ఈశ్వరీబాయి కుమార్తెగా పుట్టడం గర్వకారణం: గీతారెడ్డి
గ్రేట్ ఈశ్వరీ బాయి కుమార్తెగా పుట్టడం తనకు గర్వకారణం అని గీతారెడ్డి అన్నారు. పేదల పక్షాన కులమతాలకు అతీతంగా పోరాడిన నాయకురాలు ఈశ్వరీ బాయి అని పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, మరాఠీతో పాటు పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే ప్రతిభ ఆమె సొంతమని ప్రశంసించారు.
అసెంబ్లీలో ఈశ్వరీ బాయి ప్రశ్నించే ధైర్యం వల్ల ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చిందని గుర్తుచేశారు. తన తల్లిపై డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు, ఏ పేరు పెట్టాలనే విషయం జైపాల్ రెడ్డి ని అడిగితే ‘‘ఫైర్ బ్రాండ్’’ పేరు సూచించారని తెలిపారు. అందరికీ స్ఫూర్తిదాయకమైన ఆమె విగ్రహం మరోకటి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి నట్లు తెలిపారు. ఆ విగ్రహాన్ని ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేయాలని సీఎంను కోరామన్నారు.
