కేసీఆర్ ఓట్ల కోసమే సంక్షేమ పథకాలను అమలు చేస్తడు:ఈటల

కేసీఆర్ ఓట్ల కోసమే  సంక్షేమ పథకాలను అమలు చేస్తడు:ఈటల

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నిండు అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని పొగిడిన కేసీఆర్..అదే అసెంబ్లీలో కాంగ్రెస్ను ఖతం పట్టించారని మండిపడ్డారు. 2014లో టిడిపి ఎమ్మెల్యేను చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టింది నిజం కాదా అన్నారు. ఏ ఎమ్మెల్యేను కూడా రాజీనామా చేయించకుండా పార్టీలో అక్రమంగా చేర్చుకున్న కేసీఆర్..ప్రజాస్వామ్యంపై ప్రేమ ఒలకపోస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీడియాను  అభ్యర్థించారని..అసలు..మీడియా, మీడియా ప్రతినిధుల మీద దాడి చేసింది కేసీఆర్ కాదా ? అన్నారు. వ్యతిరేకంగా వార్తలు రాసిన ఛానళ్లను కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. చట్టాలను చట్టుబండలు చేసి..చట్టాలను కాపాడాల్సిన అధికారులను బానిసలు చేసుకుని..ప్రజాస్వామ్యాన్ని అగౌరపర్చిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. 

కేసీఆర్పై ఓటుకు నోటు కేసు పెట్టాలి...
గతంలో రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు పెట్టిన కేసీఆర్పై కూడా ఓటుకు నోటు కేసు పెట్టాలని ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ. 6వేల చొప్పున టీఆర్ఎస్ పంపిణీ చేసిందన్నారు.  తమకు టీఆర్ఎస్సే డబ్బులు ఇచ్చిందని ఓటర్లే వెల్లడించారన్నారు. ఇది ఓటుకు నోటు కేసు కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఓటుకు నోటు కేసు పెట్టాలన్నారు. ఓటుకు అమ్ముడుపోవద్దు..డబ్బులు తీసుకుని ఓటు అమ్ముకోవద్దని మునుగోడులో ఫ్లెక్సీలు కట్టిన టీఆర్ఎస్...ప్రజలు డబ్బులు పంపిణీ చేయలేదా అన్నారు. 

ప్రేమతో పథకాలు ఇవ్వడు..
సీఎం కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజలపై ప్రేమతో సంక్షేమ పథకాలు అమలు చేయడని ఈటల రాజేందర్ తెలిపారు. ఓట్ల సమయంలో పథకాలను ప్రకటిస్తారని..ఓట్లు అయిపోయాక..వాటిని అమలు చేయడన్నారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో...2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎన్ని అమలు చేశారో..కేసీఆర్ చెప్పాలన్నారు.