- .హైదరాబాద్‌పై ఖమ్మం, వరంగల్‌పై మహబూబ్‌నగర్ గెలుపు
సిద్దిపేట, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ టీ20 క్రికెట్ పోటీలు మంగళవారం సిద్దిపేటలో ఉత్సాహంగా కొనసాగాయి. సిద్దిపేట మినీ స్టేడియంలో మొదటి రోజు జరిగిన పోటీల్లో ఖమ్మం, మహబూబ్ నగర్ జట్లు విజయం సాధించాయి.
ఉదయం జరిగిన మొదటి మ్యాచ్ లో ఖమ్మం జట్టు హైదరాబాద్ పై 75 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఖమ్మం నిర్ణీత 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఖమ్మం జట్టులో బన్ని 33 బంతుల్లో 71 రన్స్ తో నాటౌట్ గా నిలవగా, హర్షిల్ రెడ్డి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. హైదరాబాద్ జట్టు బౌలర్ బాలాజీ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీశాడు.
183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేసింది. మధ్యాహ్నం జరిగిన రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మహబూబ్ నగర్ జట్టు 19.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి గెలిచింది.
మహబూబ్ నగర్ జట్టులో అబ్దుల్ రఫీ 79 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పోటీలను హెచ్ సీఏ కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగం రావు, మహబూబ్ నగర్ సెక్రటరీ రాజశేఖర్, ఖమ్మం సెక్రటరీ వెంకట్, సిద్దిపేట సెక్రటరీ మల్లికార్జున్, సిద్దిపేట అసోసియేషన్ సభ్యులు విజయ్ బాబు, మాజీద్ పర్యవేక్షించారు.
