హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం

హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాల వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఈటల కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హుటాహుటిన విచారణ జరపడం.. కబ్జా చేసినట్లు రిపోర్టు ఇవ్వడంతో వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. అడిగితే రాజీనామా చేసి ఉండే వాడిని.. నాపై కక్ష కట్టి దుష్ప్రచారం చేస్తున్నారని రగిలిపోయిన ఈటల భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలు, అభిమానులతో మంతనాలు చేస్తున్నారు. తనకు సంఘీభావం తెలిపిన ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పుడు మరో ఉద్యమం మొదలైంది.. ఆత్మగౌరవం కోసం పోరడతానని.. తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పుడువేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూములొక్కటే కాదు తన వ్యాపారాలన్నింటిపైనా సిట్టింగ్ జడ్జితో విచారణకైనా సిద్ధమేనని ప్రకటించినా పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మరో వైపు ఆయన కుటుంబ సభ్యుల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా తమ బూముల్లో సర్వే చేశారని.. కలెక్టర్ నివేదిక మొత్తం తప్పుల తడకగా ఉందని కోర్టులో ఫిర్యాదు చేశారు. తమ కంపెనీల్లోకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రవేశించి విచారణ పేరుతో సిబ్బందిని బెదిరించారని..తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని కోర్టును కోరారు. బలవంతపు చర్యలు తీసుకోరాదని డీజీపీ, విజిలెన్స్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ఈటల కుటుంబ కంపెనీ కోర్టును కోరింది.