సై.. అంటే సై: హరీశ్​.. నీ చరిత్ర  బయటపెడ్త

సై.. అంటే సై: హరీశ్​.. నీ చరిత్ర  బయటపెడ్త
  • సీఎం సీటుకు ఎసరు పెట్టిందే నువ్వు
  • 2018లో నీ వర్గం వాళ్లకు డబ్బులు పంపించి 
  • గెలిపించుకోవాల్నని చూసినవ్​
  • నోరెత్తితే అన్నీ అబద్ధాలే నువ్వో రబ్బరు స్టాంప్​వి.. 
  • నీకు స్వేచ్ఛ లేదు.. సొంతంగా ఒక్క జీవో కూడా ఇవ్వలేవు 
  • హుజూరాబాద్​ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా
  • నీ మామ, నువ్వు పబ్బతి పట్టినా మా దగ్గర గెల్వరు
  • బీజేపీ నేత ఈటల ఫైర్​.

ఈటల రాజేందర్​, హరీశ్​రావు..  ఇద్దరూ ఉద్యమంలో కలిసి పనిచేసినోళ్లు. అప్పట్ల ఊర్లల్లయినా.. పట్నంలైనా.. యూనివర్సిటీల్లయినా.. తెలంగాణ కోసం ఏడ జెండా ఎత్తితే ఆడికి కలిసి ఉరికి మద్దతిచ్చేది. పోరాటంలో ముందుండి కొట్లాడేది. మొన్నటిదాకా ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేసిన్రు. కానీ, ఇప్పుడు..!? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తీరుగా ఇద్దరి నడుమ మాటల యుద్ధం నడుస్తున్నది. ‘నువ్వా నేనా..’ అన్నట్లుగా ఒకరిపై ఒకరు గరమైతున్నరు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నరు. హుజూరాబాద్​ ఉప ఎన్నికలో తన ఉద్యమ సహచరుడికి వ్యతిరేకంగా హరీశ్​ వ్యూహాలు రచిస్తున్నరు. కేసీఆర్​, కేటీఆర్​ సహా టీఆర్​ఎస్​ పెద్దలంతా ఢిల్లీ టూర్ల ఉంటే.. హరీశ్​ మాత్రం ఇక్కడ్నే ఉండి హుజూరాబాద్​ మీద నజర్​ పెట్టిన్రు. అంతకు రెండింతలు గట్టిగా ఈటల రాజేందర్​ కూడా ఆవాజ్​ వినిపిస్తున్నరు. హరీశ్​పై విమర్శల దాడిని పెంచిన్రు.


పార్టీలో ఉండి కుట్ర 


‘ఈటల రాజేందర్​ను పెంచి పెద్ద చేసింది కేసీఆర్. కానీ తండ్రిలాంటి కేసీఆర్​ను, తల్లిలాంటి టీఆర్​ఎస్​ పార్టీని ఆయన గుండెల మీద తన్నిండు.. గులాబీ జెండా నీడలో ఎదిగిన నాయకుడు ఆ పార్టీకే వ్యతిరేకంగా మోసాలు, కుట్రలు చేసిండు.’                                               - ఆగస్టు 11 న  వీణవంకలో ఈటలపై హరీశ్​ ఫైర్ 
ఎందుకు రాజీనామా చేసినవ్..?

‘ఎందుకు రాజీనామా చేసిండో ఈటల చెప్పాలి. హుజూరాబాద్ అభివృద్ధి కోసం ఆయన రాజీనామా చేసిండా? ఈటల గెలిస్తే  వ్యక్తిగతంగా ఆయనకు, పార్టీగా బీజేపీకి మేలు జరుగుతది.. 
కానీ హుజూరాబాద్ ప్రజలకు ఏం లాభం?’                                           ‑ ఆగస్టు 29న హుజూరాబాద్​లో

చెప్పేదొకటి చేసేదొకటి

 ‘ఈటలకు ఓటమి భయం పట్టుకున్నది. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి. ఇన్నాళ్లూ తన వెనుకున్న టీఆర్​ఎస్​ నాయకులను చూసుకుని బలం అనుకున్నడు. ఆయన టీఆర్ఎస్ వీడినంక ఎవరూ ఆయన వెంట పోలేదు.’                                                                             - ఆగస్టు 30న జమ్మికుంటలో..

బొట్టు బిల్లలతో ఓట్లు కొంటున్నడు
‘డబ్బుతో ఓట్లు కొనాల్సిన పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఈటల అన్నడు. ఇప్పుడు ఆయనే గడియారాలు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు. బొట్టు బిల్లలతో ఓట్లు కొనాలని చూస్తున్నడు. ప్రతి నియోజకవర్గానికి 4 వేల డబుల్​బెడ్రూం ఇండ్లు ఇస్తే హుజూరాబాద్​లో ఒక్క ఇల్లు కూడా కట్టివ్వని వ్యక్తి ఈటల.’
                                                                                                                                                                                  ‑ సెప్టెంబర్ 1న హుజూరాబాద్​లో..


కరీంనగర్​ / హుజూరాబాద్​ టౌన్, వెలుగు: సీఎం సీటుకు ఎసరు పెట్టిందే మంత్రి హరీశ్​రావు అని, ఇతరులను కించపరిచే రీతిలో మాట్లాడుతున్నారని, ఆయన పద్ధతి మార్చుకోకపోతే అసలు చరిత్ర బయటపెడ్తానని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్​ హెచ్చరించారు. ‘‘హరీశ్​రావ్..  నువ్వు హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్ధాల కారు కూతలు కూస్తున్నవ్. అప్పుడేమో భూ కుంభకోణం అంటిరి. ఇప్పుడేమో ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టినందునే ఈటలను పక్కనపెట్టినం అనవడ్తిరి. ఇందులో ఏది నిజం? నిజానికి సీఎం సీటుకు ఎసరు పెట్టిందే నువ్వు. 2018 ఎన్నికల్లో నీ వర్గం వాళ్లకు డబ్బులు పంపించి గెలిపించుకోవాల్నని చూసినవ్” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్​ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిపై దమ్ముంటే హుజూరాబాద్​ అంబేద్కర్​ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని సవాల్​ విసిరారు. 


‘‘హరీశ్.. నువ్వు ఒక రబ్బరు స్టాంప్ వి మాత్రమే. నీకు స్వేచ్ఛ లేదు. నువ్వు సొంతంగా ఒక జీవో ఇవ్వలేవు..  బిల్లులు ఇవ్వలేవు” అని ఈటల విమర్శించారు.    హుజూరాబాద్ లోని మధువని గార్డెన్ లో గురువారం బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, యెండల లక్ష్మీనారా యణ, ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి ఆయన  మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు, నీ మామ ఇద్దరూ కలిసి కాళ్లు పైకి పెట్టి జపం చేసినా, పబ్బతి పట్టినా.. హుజూరాబాద్ లో గెల్వలేరు. మీ పార్టీకి ఘోరీ కట్టడం ఖాయం” అని హరీశ్​ను హెచ్చరించారు. కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​​, కవిత, సంతోష్​మాత్రమే ఈ రాష్ట్రాన్ని తెచ్చినట్టు, మిగిలినవాళ్లంతా వాళ్ల పనివాళ్లు అన్నట్లుగా వాళ్ల తీరు ఉందన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమకారుడివి అని, ట్రబుల్ షూటర్​వి  అని ప్రజల్లో నీమీద కొంత ప్రేమ ఉండె. కానీ ఇప్పుడు అది పోయింది. మామ మాయలో పడి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే  నీ రాజకీయ జీవితాన్ని బొంద పెట్టడం ఖాయం” అని హరీశ్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
లీడర్లను అంగట్లో సరుకుల్లా కొంటున్న నీచుడు
హుజూరాబాద్‌‌లో ప్రతిరోజూ లీడర్లను అంగట్లో సరుకుల్లాగా వెలగట్టి కొంటున్న నీచుడు హరీశ్​రావు అని ఈటల ఆరోపించారు. అర్ధరాత్రి తమ నాయకుల ఇండ్లకు దొంగల్లా వచ్చి బెదిరిస్తున్నారన్నారు.  హుజూరాబాద్‌‌లో అడ్డా పెట్టిన హరీశ్​ అబద్ధాల కారు కూతలు కూస్తున్నారని, డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నారని అన్నారు. ‘‘నీ ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్ధం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్ధతి కనిపిస్తున్నది. ఈ పద్ధతిని ఆపకపోతే నీ అసలు చరిత్ర ఏందో ప్రజలకు చెప్పాల్సి వస్తది” అని హరీశ్​ను ఈటల హెచ్చరించారు.  ‘‘తెలంగాణ ప్రజలారా.. హరీశ్​ ఇక్కడ ఏం చేస్తున్నడో మీరంతా గమనించండి.  నాకు అనుకూలంగా ఎవరెవరు ఉన్నరో తెలుసుకొని, వాళ్లను బెదిరించి,  మభ్యపెట్టి టీఆర్​ఎస్​లో  చేర్చుకుంటున్నరు. దీన్ని చూసి హుజూరాబాద్ ప్రజలైతే థూ.. అని ఉమ్ముతున్నరు” అని అన్నారు. 
పాత వాటికే ప్రారంభోత్సవాలు చేస్తున్నరు
‘‘నేను ఎలాంటి అభివృద్ధి చేయలేదని హరీశ్ అబద్ధాలు చెప్తున్నరు. ఇప్పుడు ఆయన తిరుగుతున్న 4 లేన్ల ​రోడ్లన్నీ నేను వేయించినవే. రాష్ట్రంలో అత్యధికంగా చెక్ డ్యామ్‌‌లు కట్టింది హుజూరాబాద్​ నియోజకవర్గంలోనే. ప్రతి ఊరికి మహిళా సంఘ భవనం, కుల సంఘాల భవనాలు, గుళ్లు మంజూరు చేసుకున్నం. సర్కారు డబ్బులు ఇవ్వకే  పూర్తి కాలే. ఇప్పుడు ఆ పాతవాటికే  హరీశ్​, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు చేస్తున్నరు” అని ఈటల అన్నారు. ‘‘రాష్ట్రంలో ఒక్కో ఎమ్మెల్యేకు మీరిచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు 1,400.   కానీ మా  నియోజకవర్గం అంతా సర్వే చేసి 3,900 డబుల్ బెడ్రూం ఇండ్లు అవసరమని  మంజూరు చేయించిన.  అందులో 500  ఇండ్లు హుజూరాబాద్‌‌లో, 500 ఇండ్లు జమ్మికుంటలో కట్టించిన. మరో 500 ఇల్లందకుంటలో పూర్తి కావచ్చినయ్. చినకోమటిపల్లి, కల్లుపల్లి, కోరుకల్‌‌లో మరో 500   కట్టుకున్నం. కానీ రోడ్లకు, స్తంభాలకు డబ్బులు ఇవ్వకపోవడంతో వాటిని ప్రారంభించలే. చిల్లర ఆరోపణలు చేస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు. నా మీద ఆరోపణలు చేయడంతోనే నీ పతనం మొదలైంది’’ అని హరీశ్‌‌పై ఫైర్​ అయ్యారు.  


నా వల్లనే హరీశ్​కు పదవి  
‘‘హరీశ్​రావ్​.. టీఆర్​ఎస్​లో మొదట అవమానానికి గురైంది నువ్వే కదా..? కేసీఆర్​ నిరంకుశత్వంపై నేను మాట్లాడటం వల్లనే నీకు మంత్రి పదవి వచ్చింది.. ఈ విషయం మర్చిపోకు’’ అని ఈటల అన్నారు. తాను  రోషం, నిజాయితీ ఉన్నవాడినని, తనకు హరీశ్​రావులా డ్రామాలు రావని, తనలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లేనని చెప్పారు.   

2004 అఫిడవిట్​ తీద్దామా?
‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నవ్​. 2004 లో చ్చిన అఫిడవిట్​ తీద్దామా?  నాడు ఎవరు దిక్కు లేకుండా ఉన్నది, అప్పుడు ఎవరికి ఆస్తులు ఉన్నది అందరికీ తెలుస్తది’’ అని  హరీశ్​కు ఈటల సవాల్​ విసిరారు. తాను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా కష్టపడి వ్యాపారం చేసుకొని సంపాదించానని, మీకు నాడు లేని సంపాదన  ఇప్పుడెట్లా వచ్చిందని హరీశ్‌‌ను ప్రశ్నించారు. ప్రతి పనికీ డబ్బులు తీసుకుంటున్నారని, హైదరాబాద్ భూముల కన్వర్షన్‌‌కు ఎన్ని డబ్బులు చేతులు మారుతున్నాయో సమాచారం ఉం దని, టైం వచ్చినప్పుడు బయటికొస్తాయన్నారు.