ఆ దాడి వ్యక్తిగతం కాదు..ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత

ఆ దాడి వ్యక్తిగతం కాదు..ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత

మల్లారెడ్డి పై దాడి వ్యక్తిగతం కాదు..ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేకతన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల ఆగ్రహానికి గురయ్యారని విమర్శించారు. గిరిజనులకు రిజర్వేషన్లు అని చెప్పి పీఠముడి వేసి రాకుండా చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ దూరమయ్యారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు డిఫాల్టర్లుగా మారారన్నారు ఈటల. నీళ్లున్నా పంట సాగు చేయలేని దుస్థితి కల్పించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు ధరణి స్థితి ఉందని ఎద్దేవా చేశారు. పరువు హత్యలు జరుగుతుంటే..సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తే పోలీసులు వారిని ఇబ్బందులు పెడుతున్నారన్న ఈటల శాంతి భద్రతలు కాపాడటంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. తక్షణమే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి పాలన చేతకాదని ఒప్పుకోవాలన్నారు ఈటల. సెటిలర్ల ఓట్ల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ కు నివాళులర్పించారని అన్నారు.

రెడ్ల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల అహంకారానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. అందరికీ సమన్యాయం ఉండాలి తప్ప..ఇలాంటి పరిస్థితి ఉండొద్దన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందన్న ఆయన..ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ మొత్తం బోగస్ అన్నారు. ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని వచ్చినప్పుడు గౌరవం ఇచ్చే సంస్కారం లేని సీఎంకు ప్రజలు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.  ఎన్ని కంపెనీలు వచ్చినా తెలంగాణ వాళ్ళకు మాత్రం చిన్న చిన్న ఉద్యోగాలే ఇస్తున్నారని ఈటల అన్నారు. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయాడన్నారు.