యూరప్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, డెత్స్

యూరప్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, డెత్స్
  • కొన్ని రోజులుగా కేసులు, డెత్స్ పెరుగుతున్నయ్
  • టీకాల విషయంలో ఈయూ దేశాల మధ్య వ్యత్యాసాలు 
  • కొన్ని దేశాల్లో ఫ్రీ టెస్టులు ఆపేయడం.. వ్యాక్సినేషన్ నెమ్మదించడమే కారణం 

బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టినా.. యూరప్ దేశాల్లో మాత్రం వైరస్ కంట్రోల్ కావడంలేదు. కొన్ని వారాలుగా యూరప్ లోని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, బల్గేరియా, తదితర దేశాల్లో కొత్త కేసులు, డెత్స్ క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఫ్రీగా కొవిడ్ టెస్టులు చేయకపోవడం, వ్యాక్సినేషన్ నెమ్మదిగా, గందరగోళంగా సాగడమే కరోనా వ్యాప్తి పెరగడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అమెరికా, రష్యా, బ్రిటన్, టర్కీ, వంటి దేశాల్లో ఇప్పటికీ కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కానీ ఈ దేశాల్లో వీక్లీ డెత్ రేట్ మాత్రం 4% వరకూ పడిపోయింది. అయితే యూరప్ కంట్రీస్ లో మాత్రం అటు కేసులు, ఇటు మరణాలు పెరుగుతున్నాయి. ‘‘గత వారం రోజుల్లో అన్ని దేశాల్లో కలిపి 31 లక్షల కొత్త కేసులు వచ్చాయి. అంతకుముందు వారంతో పోలిస్తే కొత్త కేసులు 1% పెరిగాయి. అయితే వీటిలో రెండింట మూడొంతుల కేసులు (19 లక్షలు) యూరప్ దేశాల్లోనే నమోదయ్యాయి. ఇక్కడ ఒక్కవారంలోనే కొత్త కేసులు 7% పెరిగాయి. వీక్లీ కరోనా డెత్స్ మరింత ఎక్కువగా 12% వరకు పెరిగాయి” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) బుధవారం వెల్లడించింది. 

టీకాలు ఉన్నా.. గందరగోళం 

యూరప్ దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా, కొన్నిచోట్ల గందరగోళంగా కొనసాగుతోందని డబ్ల్యూహెచ్​వో ఎమర్జెన్సీస్ చీఫ్​ డాక్టర్ మైకేల్ ర్యాన్ ఆందోళన వ్యక్తంచేశారు. టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈయూలోని అన్ని దేశాలకు సమానంగా అందట్లేదని, దీంతో దేశాల మధ్య వ్యాక్సినేషన్​లో గ్యాప్ వస్తోందన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలని సూచించారు. ఇప్పటికే 40% కంటే ఎక్కువ మందికి టీకాలు వేసిన దేశాలు తాత్కాలికంగా వ్యాక్సినేషన్ ఆపాలని, టీకాలను ఇంకా ఫస్ట్ డోస్ కూడా కంప్లీట్ చేయని దేశాలకు ఇవ్వాలని డబ్ల్యూహెచ్​వో చీఫ్​ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియేసస్ విజ్ఞప్తి చేశారు. ఇమ్యూనిటీ పరంగా బలహీనంగా ఉన్నోళ్లకు తప్పితే ఇతరులెవరికీ బూస్టర్ డోస్ ఇవ్వొద్దన్నారు. 

ఫ్రాన్స్ లో బూస్టర్ డోసులు 

కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలంతా బూస్టర్ డోస్ టీకాలు వేసుకోవాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం 65 ఏండ్లు పైబడినవాళ్లు, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నోళ్లు బూస్టర్ డోస్ వేసుకోవాలని చెప్పారు. డిసెంబర్ నుంచి 50 ఏండ్లు పైబడినవాళ్లకు బూస్టర్ డోస్​లు అందుబాటులోకి వస్తాయన్నారు. 

ఇన్ పేషెంట్లు పెరుగుతున్నరు

స్లోవేకియాలో కరోనా బారిన పడి దవాఖాన్లలో చేరుతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని ఆ దేశ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 7 వేల కేసులు వచ్చాయని, దవాఖాన్లలో చేరుతున్న వాళ్లలో 80% మంది రెండో డోస్ టీకా పూర్తికాని వాళ్లేనని పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ స్పీడప్ అవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇక చెక్ రిపబ్లిక్​లోనూ వ్యాక్సినేషన్ స్లోగా ఉండటంతో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఆదుకోవాలంటూ బల్గేరియా విజ్ఞప్తి

బల్గేరియాలో కరోనా వ్యాప్తి తీవ్రం కావడం, దవాఖాన్లలో ఫెసిలిటీలు తక్కువగా ఉండటంతో ఈయూ​లోని మిగతా దేశాలు ఆదుకోవాలని బుధవారం విజ్ఞప్తి చేసింది. యూనియన్ లోని ఏ దేశమైనా విపత్తులు, ఎమర్జెన్సీ టైంలో ఇతర దేశాల సహాయాన్ని కోరుతూ సివిల్ ప్రొటెక్షన్ మెకానిజంను యాక్టివేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ డివైస్​లు, హాస్పిటల్ బెడ్లకు కొరత ఏర్పడిందని, సహాయం చేయాలని కోరింది. దేశంలో మంగళవారం ఒక్కరోజే 334 డెత్స్ నమోదయ్యాయని, ఇప్పటివరకూ ఒక్కరోజులో ఇవే అత్యధిక మరణాలని పేర్కొంది. 

ఫ్రీ టెస్టులు మళ్లీ చేయాలె.. జర్మనీ 

జర్మనీలో ముందుగా భయపడినట్లే జరిగిందని, ప్రజల నిర్లక్ష్యం కారణంగా ఫోర్త్ వేవ్ వచ్చిం దని రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ లోథర్ వీలర్ అన్నారు. దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ రేట్ వేగంగా పెరిగిందని, ఇటీవల ఐసీయూల్లో చేరుతూ, చనిపోతున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోందన్నారు. జనం మాస్కులు పెట్టుకోవడం, దూరం పాటించడం, టెస్టింగ్ సెంటర్ల పై ఆంక్షలు ఉండటం, ఫ్రీ టెస్టులు చేయకపోవడమే ఫోర్త్ వేవ్​కు దారితీసిందన్నారు. ‘‘ప్రజలు టీకాలు వేసుకునేలా చూసేందుకు జర్మనీలో ఫ్రీ టెస్టులను నిలిపివేశారు. ఒక్కో టెస్టుకు 19 యూరోలు(రూ. 1,618) వసూలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఫ్రీ టెస్టులు మళ్లీ చేయాలి. సెంటర్లపై ఆంక్షలు తొలగించాలి” అని వీలర్ సూచించారు.

బీజింగ్‌‌‌‌‌‌‌‌లో మళ్లీ ఆంక్షలు

చైనాలోనూ కరోనా మళ్లీ పెరుగుతోంది.బీజింగ్​లో కొత్తగా 45 కేసులు బయటపడ టంతో అధికారులు మళ్లీ ఆంక్షలు పెట్టారు. సిటీలో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించరాదని, ఆన్ లైన్ లో మాత్రమే ఈవెంట్లు జరుపుకోవా లని గురువారం ఆదేశాలు జారీ చేశారు. బీజింగ్ లో ఒక్క కరోనా కేసు కూడా రాకూడ దంటూ అధికారులు కొవిడ్ జీరో విధానాన్ని స్ట్రిక్టుగా అమలు చేస్తున్నారు. రాజధానిలో కరోనా కేసులు నమోదైన ఓ షాపింగ్ మాల్ తో సహా పలు రెసిడెన్షియల్ ఏరియాలను క్లోజ్ చేశారు. బీజింగ్ తో పాటు దేశవ్యాప్తంగా 21 ప్రావిన్స్ ల్లోనూ కొత్తగా 1000 లోకల్ ట్రాన్స్ మిషన్ కేసులు నమోదయ్యాయి.