పొల్మోర్ స్టీల్‌‌ భారీ విస్తరణ .. రైళ్ల కంపెనీల‌‌కు విడిభాగాల సరఫరా

పొల్మోర్ స్టీల్‌‌ భారీ విస్తరణ .. రైళ్ల కంపెనీల‌‌కు విడిభాగాల సరఫరా
  • ప్లాంటును సందర్శించిన పోలండ్ రాయబారి 

హైదరాబాద్, వెలుగు: యూరప్​లోని పలు దేశాల రైల్వే కంపెనీలకు విడిభాగాలు తయారు చేసి ఇచ్చే  పొల్మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్  పెద్ద ఎత్తున విస్తరిస్తోంది.  త‌‌ద్వారా ఈ ప్రాంతంలో మ‌‌రిన్ని ఉద్యోగ అవ‌‌కాశాలు క‌‌ల్పించనుంది. మెద‌‌క్​లోని​ కాళ్లక‌‌ల్‌‌, ముప్పిరెడ్డిప‌‌ల్లి ఇండ‌‌స్ట్రియ‌‌ల్ ఏరియాలోని ఆటోమోటివ్ పార్కులో దీనికి ఫెసిలిటీలు ఉన్నాయి. మనదేశంలో పోలండ్ రాయ‌‌బారి, చార్జ్ డీ ఎఫైర్స్ డాక్టర్ సెబాస్టియన్ డొమ్‌‌జల్‌‌స్కీ ఈ ప్లాంటును గురువారం సంద‌‌ర్శించారు.

 ఆయ‌‌న‌‌తో పాటు పోలండ్ కాన్సుల్ జ‌‌న‌‌ర‌‌ల్ డాక్టర్ అలెగ్జాండర్​ దండా, పోలండ్‌‌  రాయబార కార్యాల‌‌యంలో ఆర్థిక వ్యవ‌‌హారాల కౌన్సెల‌‌ర్ పావెల్ మోక్రజైకి, పొల్మోర్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు కూడా ఉన్నారు. ఇప్పుడున్న ప్లాంటుతో పాటు నిర్మాణంలో ఉన్న రెండో ప్లాంటునూ ఈ బృందం సందర్శించింది. భారతదేశంలో ఒక పోలండ్ కంపెనీ సాధించిన వృద్ధిని డొమ్‌‌జల్‌‌స్కీ ప్రశంసించారు. భారీగా ఉద్యోగాలు క‌‌ల్పిస్తున్నందుకు పొల్మోర్ స్టీల్‌‌ను అభినందించారు. 

కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న మేకిన్ ఇండియా విధానానికి అనుగుణంగా సాగుతున్న ఈ కంపెనీ త‌‌న విజయాల‌‌ను మ‌‌రింత‌‌గా కొన‌‌సాగించాల‌‌ని ఆకాంక్షించారు. కేవీఆర్​ సుబ్బారావు మాట్లాడుతూ, విస్తరణకు  మ‌‌రో మూడు ఎక‌‌రాల భూమి, 2.5 మిలియ‌‌న్ యూరోల పెట్టుబ‌‌డి కేటాయించామని ప్రకటించారు.  మ‌‌రో వంద‌‌మందికి ఉద్యోగ అవకాశాలు క‌‌ల్పిస్తున్నామని అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ఐఐసీల‌‌తోపాటు, వివిధ వ‌‌ర్గాల నుంచి ఆశించిన మద్దతు వస్తోందని ఆయన వివరించారు.