
- అదానీకి ఊరట...
- ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో గట్టెక్కిన రూ. 20 వేల కోట్ల ఎఫ్‌పీఓ
ముంబై: హిండెన్‌బర్గ్ రిపోర్టుతో రిటెయిల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజస్ ఫాలో ఆన్పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీఓ) సక్సెసయింది. దేశంలోనే అతి పెద్ద ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ తెచ్చిన అదానీ ఎంటర్‌ప్రైజస్ రూ. 20 వేల కోట్లను సమీకరించగలిగింది. మంగళవారమే ఎఫ్‌పీఓకి చివరి రోజు. ఎఫ్‌పీఓ కింద 4,55,06,791 తాజా షేర్లను జారీ చేయనుండగా, మొత్తం 5,08,68,352 షేర్లకు బిడ్లు వచ్చినట్లు డేటా చెబుతోంది. అంటే 112 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ తెచ్చుకోగలిగింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ), క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లు (క్యూఐబీ) నుంచి ఈ ఎఫ్‌పీఓకి స్ట్రాంగ్ డిమాండ్ వచ్చింది. ఎన్‌ఐఐల కోసం 96.16 లక్షల షేర్లను కేటాయిస్తే, ఏకంగా దీనికి మూడు రెట్లకు బిడ్స్ దాఖలయ్యాయి. ఇక క్యూఐబీల కోసం 1.28 కోట్ల షేర్లను రిజర్వ్ చేయగా, అంత మొత్తానికీ సబ్స్క్రిప్షన్ దొరికింది. ఎంప్లాయీ కోటా కింద 55 శాతం బిడ్లు వస్తే, రిటెయిల్ ఇన్వెస్టర్ల నుంచి మాత్రం కేవలం 12 శాతం బిడ్లే వచ్చాయి. అదనపు డిస్కౌంట్లు ఇచ్చినా కూడా రిటెయిల్ ఇన్వెస్టర్లు అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ పట్ల ఉత్సాహం చూపించలేదు. దీంతో రిటెయిల్ షేర్హోల్డర్లను భారీగా పెంచుకోవాలనే అదానీ ప్లాన్స్ నెరవేరలేదు.
ఈ ఎఫ్‌పీఓ ఇంపార్టెంట్...
పరువు ప్రతిష్టల విషయంలో ఛాలెంజ్ ఎదుర్కొంటున్న అదానీకి ఈ ఫాలో ఆన్పబ్లిక్ ఆఫర్ కీలకంగా మారింది. గ్రూప్ అప్పు తగ్గించుకోవడమే కాకుండా, ఇన్వెస్టర్ల నమ్మకం సడలలేదని చెప్పుకోవడానికీ అదానీ కి ఈ ఎఫ్‌పీఓ వీలు కల్పిస్తుంది. ఇప్పటికే స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టింగ్ పొందిన కంపెనీలు ఇన్వెస్టర్లకు మరోసారి షేర్లను జారీ చేయడాన్నే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. హిండెన్‌బర్గ్ రిపోర్టు నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ సక్సెస్‌పై చాలా మందికి అనుమానం కలిగింది. అబుధాబి ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) ఎఫ్పీఓలో భాగంగా 400 మిలియన్ డాలర్లను అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్‌లో పెట్టుబడిగా పెట్టింది. ఎమిరేట్ రాయల్ ఫ్యామిలీ ఈ ఐహెచ్‌సీని కంట్రోల్ చేస్తోంది.
తాజా ఆఫరింగ్‌లో 16 శాతాన్ని సమకూర్చిన ఐహెచ్సీ ఇప్పటికే అదానీ కంపెనీలలో 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ ఎఫ్‌పీఓ సక్సెస్ కావడం ఇన్వెస్టర్లకు ఊరట కలిగిస్తుందని లుక్రార్ ఎనలిటిక్స్ (సింగపూర్) సీనియర్ క్రెడిట్ ఎనలిస్ట్ లియొనార్డ్ లా చెప్పారు. ఎఫ్‌పీఓ వల్ల కంపెనీలో ఇతరులు (ప్రమోటర్లు కాని వారు) వాటా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్‌పై నమ్మకం సడలలేదనడానికి ఎఫ్‌పీఓ సక్సెస్ నిదర్శనంగా నిలుస్తుందని వెంచురా సెక్యూరిటీస్ రిసెర్చ్ హెడ్ వినితి బొలిన్జ్కర్ చెప్పారు. కంపెనీ షేర్లలో ఒడిదుడుకులు తగ్గితే మళ్లీ చిన్న ఇన్వెస్టర్లు ముందుకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరుగుతున్న టైములో ఎఫ్‌పీఓ తేవడం సరయిన నిర్ణయమేనని వివరించారు.
రిచ్‌లిస్టులో కిందికి గౌతమ్ అదానీ...
మంగళవారం ట్రేడింగ్‌లో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ షేర్లు పెరిగినప్పటికీ, అదానీ టోటల్ గ్యాస్ షేరు మాత్రం పడిపోయింది. ఈ షేరు 10 శాతం పడటంతో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. కిందటి వారం దాకా ప్రపంచంలోనే మూడో రిచెస్ట్ వ్యక్తిగా నిలిచిన గౌతమ్ అదానీ ఫోర్బ్స్ రియల్ టైమ్ గ్లోబల్ రిచ్ లిస్టులో ఇప్పుడు 8 వ ప్లేస్‌కి పడిపో యారు.
ఇజ్రాయెల్‌లో ఏఐ ల్యాబ్..
హైఫా (ఇజ్రాయెల్): ఇటీవల హైఫా పోర్టును చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ తాజాగా టెల్ అవివ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. హైఫాలో రియల్ ఎస్టేట్‌ను కూడా డెవలప్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఒక వైపు యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్ బర్గ్ రిపోర్టుతో విమర్శలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ హైఫా పోర్టు ఎగ్రిమెంట్ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి కనిపించడమే కాకుండా, ఇజ్రాయెల్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. హిండెన్‌బర్గ్ రిపోర్టుకు సంబంధించి మాత్రం ఇక్కడ గౌతమ్ అదానీ ఎలాంటి ప్రస్తావనా తేలేదు. ఇండియా, యూఎస్‌లలోని తమ ఏఐ ల్యాబ్‌లతో కలిసి పనిచేసేలా టెల్ అవివ్‌లో ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు అదానీ పేర్కొన్నారు. హైఫా రూపురేఖలే మారిపోతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ సిటీని మార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు.