సర్కారు వద్దన్నా.. అందరూ వరే వేస్తున్రు

సర్కారు వద్దన్నా.. అందరూ వరే వేస్తున్రు
  • సర్కారు వద్దన్న ఇతర పంటలేయలేక వరికే మొగ్గు
  • 5 లక్షల ఎకరాలకు చేరిన నాట్లు

హైదరాబాద్‌, వెలుగు: యాసంగిలో వరి వేయొద్దు..  కొనుగోలు కేంద్రాలు ఉండవని సర్కారు చెప్పినా.. రైతులు గత్యంతరం లేక వరే పెడ్తున్నరు. సీఎం కేసీఆర్‌ వేయంగలేంది.. మనం ఎందుకు వేయొద్దని కొందరు రైతులు, బురద పొలాల్లో వరి తప్ప మరేం పండదని మరికొంత మంది రైతులు పొలం బాట పడుతున్నరు. పంట వేసుడా.. ఊకుండుడా.. అని సతమతమైన రైతులు.. చూసీ చూసీ నార్లు పోశారు. దీంతో రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం పెరుగుతోంది. పది రోజుల క్రితం వరకు తక్కువగా ఉన్న సాగు క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో వరినాట్లు ఆలస్యంగా మొదలయ్యాయి. పండుగ తర్వాత జోరు పెరిగే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిరుటి సాగులో ఈసారి సగం వరకు నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
15.61లక్షల ఎకరాల్లో యాసంగి సాగు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 15.61లక్షల ఎకరాల్లో రైతులు యాసంగి పంటలు సాగు చేశారు. ఇందులో వరి నాట్లు నాలుగున్నర లక్షల ఎకరాలు దాటి దాదాపు 5 లక్షల ఎకరాలకు చేరుకుంటోంది. ఈ యాసంగిలో 25 లక్షల ఎకరాలకు పైగా బోర్లు, బావుల కింద సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు పప్పు శనగ 3.20 లక్షల ఎకరాలు, వేరుశనగ 3.10 లక్షల ఎకరాలు మాత్రమే పెద్ద మొత్తంలో సాగయ్యాయి. మొక్కజొన్న 2.10 లక్షల ఎకరాల్లో,  జొన్న60 వేల ఎకరాలు, మినుములు 65 వేల ఎకరాలు, సన్‌ఫ్లవర్‌ 22 వేల ఎకరాలు, పెసలు12 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు.
నాట్లు ఊపందుకుంటున్నయ్‌..
రెండు మూడు వారాల క్రితం లక్ష ఎకరాలు దాటని వరి నాట్లు క్రమంగా ఊపందుకున్నాయి. రోజు రోజుకు వరి సాగు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 5 లక్షల వరకు చేరుకుంటున్న వరి పొలాలు ఈ నెలాఖరుకు మరో 20 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. యాసంగి సాగు 31లక్షల ఎకరాలు కాగా నిరుడు 52 లక్షల ఎకరాలు దాటింది. కానీ ఈయేడు వరి సాగుపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. అయినప్పటికీ ఏ పంటలు వేయాలో తెలియక, కొన్ని పంటలు వేయలేక మళ్లీ వరి సాగువైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో వరి నాట్లు ఊపందుకుంటున్నయి. రైతులు నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.