మరోసారి జనంలోకి బీజేపీ

మరోసారి జనంలోకి బీజేపీ

నేటి నుంచి వరుస కార్యక్రమాలు
26న జనం గోస..     బీజేపీ భరోసా 
27న జిల్లాల్లో పార్టీ సమావేశాలు
29న పార్టీ మండల సమావేశాలు
డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్లను చేర్పించడంపై స్పెషల్ డ్రైవ్

 

హైదరాబాద్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికలో ఓడినా... నైతిక విజయం తమదేనని బీజేపీ ఉత్సాహంతో ఉంది. ఈ ఉత్సాహంతో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న దక్షిణ తెలంగాణలో సైతం టీఆర్ఎస్ కు తామే అసలైన ప్రత్యామ్నాయంగా నిలిచామని చాటుకుంటోంది. ఆ ఊపు మీద ఉన్న కమల దళం.. ఇప్పుడు తిరిగి జనం బాట పట్టింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన నియోజకవర్గాల్లో ‘జనం గోస.. బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలకు సిద్ధమైంది. అలాగే 26, 27 న రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పార్టీ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనుంది.

బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతం, ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జిల్లా స్థాయిలో అమలు చేయడంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.  ఇక ఈ నెల 28 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. మరోవైపు 29 నుంచి వచ్చే నెల 8 వరకు కొత్త ఓటర్ల నమోదు కోసం స్పెషల్ డ్రైవ్  చేపట్టనుంది. ఓటు హక్కు పొందడానికి అర్హులైన యువతీ యువకులను గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చించడం, ఓటర్ లిస్టు నుంచి వివిధ కారణాలతో తొలగించిన వారిని తిరిగి చేర్పించే విషయంలో బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు దృష్టి పెట్టనున్నారు. అలాగే ఈ నెల 29, 30న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పార్టీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. బూత్ స్థాయిలో, శక్తి కేంద్రాల వారిగా, గ్రామాల్లో  పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ ప్రోగ్రామ్ లన్నింటినీ విజయవంతం చేయడంపై పార్టీ క్యాడర్ దృష్టి పెట్టింది. కమల దళంలో ఇప్పుడు ఈ కార్యక్రమాలతో మరోసారి హడావుడి నెలకొంది.