కర్నాటకలో కేబుల్​ బ్రిడ్జిపైకి కారు

కర్నాటకలో కేబుల్​ బ్రిడ్జిపైకి కారు

కర్నాటకలో కేబుల్​ బ్రిడ్జిపైకి కారు
యెల్లపురాలో ఘటన
స్థానికుల అభ్యంతరంతో దించేసిన టూరిస్టులు
కేసు నమోదు చేసి, కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు

బెంగళూరు : గుజరాత్​లో కేబుల్​ బ్రిడ్జి తెగి భారీ ప్రాణ నష్టం సంభవించిందని తెలిసి కూడా, కొందరు తీగల వంతెనపై ఏకంగా కారునే ఎక్కించారు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ఫేమస్​ టూరిస్ట్​ స్పాట్ అయిన శివపుర కేబుల్​ బ్రిడ్జిపై చోటు చేసుకుంది. కొందరు టూరిస్టులు మారుతి సుజుకీ 800 కారునే తీగల వంతెనపైకి తీసుకొచ్చారు. ఇది చూసిన స్థానికులు.. వెంటనే బ్రిడ్జిపై నుంచి కారును దించేయాలని కోరారు. అయినా వినిపించుకోని టూరిస్టులు కారును మరింత ముందుకు తీసుకొచ్చారు. బరువు ఎక్కువగా ఉండటంతో బ్రిడ్జి కూలే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరించారు. వెంటనే కారును వెనక్కి తీసుకోవాలంటూ గొడవకు దిగారు.

అక్కడున్న వారు కూడా అభ్యంతరం చెప్పడంతో కారును వెనక్కి తీసుకెళ్లిపోయారు. కారు బ్యాక్​ తీసుకెళ్తున్నప్పుడు వంతెన ఊగుతూ.. ప్రమాదకరంగా కనిపించింది. ఆ టైంలో కారు వెనుక, ముందు చాలా మంది టూరిస్టులు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించారు. కారు స్వాధీనం చేసుకుని టూరిస్టులపై కేసు నమోదు చేశామన్నారు.