పెట్రోల్‌పై లాభం.. డీజిల్​పై నష్టం

పెట్రోల్‌పై లాభం.. డీజిల్​పై నష్టం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు (ఓఎంసీలు) పెట్రోల్‌‌‌‌ను లీటర్‌‌కు రూ.10 లాభానికి అమ్ముతున్నప్పటికీ, ఇది వరకటి నష్టాల కారణంగా రిటైల్ ధరలు తగ్గించడం లేదు.  డీజిల్‌‌పై లీటర్‌‌కు ఇవి రూ. 6.50 నష్టాన్ని భరిస్తున్నాయి.  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్) చాలా నెలలుగా ఇంటర్నేషనల్ ధరలకు అనుగుణంగా పెట్రోల్,  డీజిల్ ధరలను మార్చడం లేదు. రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కలిగిన నష్టాలను పూడ్చుకోవడానికి ఇప్పుడు పెట్రోల్​ను ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి.  2022 జూన్ 24 తో ముగిసిన వారానికి ఓఎంసీలు పెట్రోల్‌‌పై లీటరుకు రూ. 17.4,  లీటర్ డీజిల్‌‌పై రూ. 27.7 రికార్డు స్థాయిలో నష్టపోయాయి. మూడో క్వార్టర్​లో (అక్టోబర్-–డిసెంబర్ 2022) పెట్రోల్ మార్జిన్లు లీటరుకు రూ. 10 వరకు ఉంటున్నాయి. డీజిల్ నష్టాలు లీటర్‌‌ రూ. 6.50లకు చేరాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌‌ నివేదికలో పేర్కొంది. ఇన్‌‌పుట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏప్రిల్​ నెలలో బ్యారెల్‌‌కు  102.97 డాలర్ల నుండి జూన్‌‌లో 116.01 డాలర్ల కు పెరిగాయి. ఈ నెలలో రేటు 78.09 డాలర్లకి పడిపోయినప్పటికీ, ఈ మూడు ఓంఎసీలు 2022 ఏప్రిల్​ఆరో తేదీ నుంచి పెట్రోల్,  డీజిల్ ధరలను తగ్గించలేదు. రిటైల్ అమ్మకపు ధరల కంటే ఇన్‌‌పుట్ ధర ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ధరలను అలాగే ఉంచడం వల్ల ఈ మూడు సంస్థలు నష్టాల పాలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్–-సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్పీజీ సబ్సిడీని చెల్లించకపోవడంతో ఇవి రూ. 21,201.18 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకున్నాయి. బ్యారెల్‌‌కు 10.5-–12.4 డాలర్ల స్థూల రిఫైనింగ్ మార్జిన్​ ఉన్నా, మూడు కంపెనీలకు రెండో క్వార్టర్​లో నష్టాలు వచ్చాయి. త్వరలో లాభాలు వచ్చే అవకాశం ఉందని  ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. 

నష్టాలు తప్పవు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–-డిసెంబర్ క్వార్టర్​లో ఐఓసీకి రూ. 2,400 కోట్లు, బీపీసీఎల్​కు రూ. 1,800 కోట్లు,  హెచ్​పీసీఎల్​కు రూ. 800 కోట్ల ఇబిటా ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఓసీకి రూ. 1,300 కోట్ల నికర నష్టం రావొచ్చు. హెచ్​పీసీఎల్ రూ. 600 కోట్ల నష్టాన్ని చవిచూడవచ్చు. బీపీసీఎల్ బ్రేక్ ఈవెన్ సాధించవచ్చని ఐసీఐసీఐ పేర్కొంది.