సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?
  • సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?
  • ఎలక్షన్లు నిర్వహించాలంటూ గతంలో హైకోర్టు ​జడ్జి ఆదేశాలు
  • నోటిఫికేషన్​ రిలీజ్​ చేసిన కేంద్ర కార్మిక శాఖ
  • సహకరించని సింగరేణి, రాష్ట్ర సర్కారు
  • ప్రచారానికి దూరంగా పలు కార్మిక సంఘాలు 
  • ఈ రోజు రానున్న  హైకోర్టు  ఫుల్​ బెంచ్​ తీర్పుపై  ఉత్కంఠ

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు ఎన్నికల నోటిఫికేషన్ ​విడుదలైనప్పటికీ ఎన్నికలపై అనుమానాలు తొలగిపోవడం లేదు. కేంద్ర కార్మిక శాఖకు అటు సింగరేణి యాజమాన్యంతో పాటు ఇటు సర్కారు సహకరించకపోవడంతో ఎన్నికలు జరుగుతాయో? జరగవో తెలియక సంఘాలు కూడా ప్రచారానికి వెళ్లడం లేదు. మరోవైపు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం హైకోర్టు పుల్​బెంచ్​కు అప్పీల్​కు వెళ్లింది. దీనిపై బుధవారం కోర్టు తీర్పు వెలువడనుంది. ఈ జడ్జిమెంట్​పైనే ఈనెల 28న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయో..జరగవో అన్నది తేలనున్నది.  

మొదటి నుంచి సహకరించని యాజమాన్యం 

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై మొదటి నుంచి సింగరేణి యాజమాన్యం ఆసక్తి చూపడంలేదు. ప్రతిసారి ఏదో కారణంతో వాయిదా వేసే ప్రయత్నం చేస్తోంది. చివరికి హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే  కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహించేందుకు షెడ్యూల్​రిలీజ్​ చేసినా యాజమాన్యం మళ్లీ అప్పీల్​కు వెళ్లింది. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించలేమని, గడువు కావాలంటూ సింగరేణి గతనెల హైకోర్టును కోరింది. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వానికి లెటర్లు రాశారని చెప్పింది.

వరుస పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల సంఘం పలు భేటీలు నిర్వహించనుందని వారు లెటర్​లో పేర్కొన్నట్టు తెలిపింది. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆదేశాలిస్తూ యాజమాన్యం  దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ మేనేజ్​మెంట్​మళ్లీ ఫుల్​బెంచ్​కు అప్పీల్​కు వెళ్లింది. సెప్టెంబర్​27న కార్మికశాఖ నిర్వహించిన సమావేశానికి కూడా సింగరేణి యాజమాన్యం హాజరుకాలేదు. అదే రోజు కేంద్ర కార్మికశాఖ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్​ చేసింది.

అక్టోబర్​28న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.  మరోవైపు గుర్తింపు సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని, అందువల్ల ఎన్నికల నిర్వహణలో ముందుకెళ్లలేకపోతున్నామని హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర పిటిషన్​ దాఖలు చేసింది. జూన్​23న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అక్టోబర్​28న ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్​ రిలీజ్​ చేశామంటూ కేంద్ర డిప్యూటీ చీఫ్​లేబర్​ కమిషనర్​ డి.శ్రీనివాసులు మధ్యంతర పిటిషన్​వేశారు. దీనిపై కూడా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. సింగరేణి యాజమాన్యం కూడా ఇంతవరకు ఓటర్ల వివరాలను ఎన్నికల అధికారితో పాటు కార్మిక సంఘాలకు అందజేయలేదు.

ఎన్నికల ఏర్పాట్లపై సింగరేణి ఆఫీసర్లతో చర్చించేందుకు ఈనెల 4,5 తేదీల్లో బెల్లంపల్లి, రామగుండం, కొత్తగూడెం రీజియన్లలో కేంద్ర కార్మికశాఖ బృందాలు పర్యటించాల్సి ఉండగా యాజమాన్యం సహకరించలేదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు కేంద్ర కార్మికశాఖ షెడ్యూల్​ప్రకారం అక్టోబర్​ 6,7 తేదీల్లో సంఘాల నుంచి నామినేషన్లు స్వీకరించింది. మంగళవారం నామినేషన్​దాఖలు చేసి బరిలో నిలిచిన 13 కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులను కేటాయించింది.  

ఎన్నికల కన్నా.. సమాన గుర్తింపుకే ప్రియారిటీ...

గుర్తింపు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అన్ని సంఘాలకు సమాన గుర్తింపు ఇస్తామని సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడంతో, ఇక ఎన్నికలతో పనేముందనే ఉద్దేశంతో కొన్ని సంఘాల నేతలు ధీమాగా ఉన్నారు. దీంతో సింగరేణిలో ఎన్నికల ప్రచార ప్రభావం కన్పించడంలేదు. సమస్యలపై చర్చల కోసం అన్ని సంఘాలను సమానంగా గుర్తిస్తామని యాజమాన్యం చెప్పిందే తప్ప1998 ఎన్నికలకు ముందున్న పరిస్థితిని కొనసాగిస్తామని అందులో స్పష్టం చేయలేదు. చట్టపరంగా నిర్వహించాల్సిన మైన్స్​కమిటీ, రక్షణ కమిటీ, స్ర్టక్చర్డ్​ కమిటీ, జేసీసీ సమావేశాలను నిర్వహిస్తామని యాజమాన్యం ఎలాంటి క్లారిటీ ఇవ్వకున్నా  కొన్ని సంఘాలు ఎన్నికలు తమకెందుకులే అనే ధోరణిలో ఉన్నాయని తెలుస్తోంది.

ఎన్నికలపై ఆసక్తి లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా సంఘాలు ఊగిసలాట మధ్యే నామినేషన్లు వేశాయి. ఎన్నికల నిర్వహణకు  కోర్టు నుంచి నిర్ణయం వస్తే తమ యూనియన్ మనుగడ, ఉనికికి ప్రమాదమని భావించి నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐటీయూసీ, బీఎంఎస్​యూనియన్లు గనులపై ఎన్నికల ప్రచారంలో భాగంగా గేట్​మీటింగ్​లు నిర్వహిస్తూ తమ సంఘాలను గెలిపించాలని కార్మికులను అభ్యర్థిస్తున్నాయి. మిగిలిన కొన్ని సంఘాల్లో ఎన్నికల పట్ల నిర్లిప్తత కనిపిస్తోంది.