పొగ తాగుతున్నరు.. పానం తీస్కుంటున్నరు

పొగ తాగుతున్నరు..  పానం తీస్కుంటున్నరు

థియేటర్‌‌‌‌లో సినిమా మొదలవగానే ‘ఈ నగరానికి ఏమయింది.. ఓవైపు నుసి.. మరోవైపు పొగ’ అని యాడ్‌‌‌‌ చూస్తాం. పొగ తాగడం మానేయాలని, లేదంటే తీవ్రమైన రోగాలొస్తాయని చెప్పడానికే ఆ యాడ్‌‌‌‌ను ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. అయినా సిగరెట్‌‌‌‌ ప్రియులు మాత్రం మారడం లేదు. పైపెచ్చు ఇంకా ఎక్కువగా సిగరెట్లు కాల్చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 10 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారట. ఏటా దేశంలో చనిపోతున్న 7.2 లక్షల మందిలో 13 శాతం వాటా పొగాకు సంబంధిత రోగాలదేనట. 

ప్రత్యామ్నాయాలొద్దు
ఆ మధ్య మార్కెట్లోకి వచ్చిన ఈ సిగరెట్లు ఆరోగ్యానికి హానికరమా? కాదా? అని కేంద్ర ఆరోగ్యశాఖకు సంబంధించిన ఓ వర్కింగ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఆరా తీసింది. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ (ఈఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌) ఆరోగ్యానికి హానికరమని, కేన్సర్‌‌‌‌ లాంటి రోగాలొస్తాయని, ఈ–సిగరెట్లను తాగినా సాధారణ సిగరెట్లలానే వ్యసనంగా మారిపోతుందని తేల్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నిపుణులు చేసిన సర్వేల్లో దీనికి పూర్తి వ్యతిరేకంగా చెప్పారు. సాధారణ సిగరెట్లతో పోలిస్తే 5 శాతం కూడా ఈ–సిగరెట్లు డేంజర్‌‌‌‌ కావన్నారు. అందుకే బ్రిటన్‌‌‌‌ లాంటి దేశాల్లో వీటికి పచ్చజెండా ఊపారని చెప్పారు. అమెరికాలోని నేషనల్‌‌‌‌ అకాడమిక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌ కూడా ఈ–సిగరెట్లు అంత డేంజర్‌‌‌‌ కాదని చెప్పింది. అమెరికా ఫుడ్‌‌‌‌ అండ్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ కూడా ‘హీట్‌‌‌‌ నాట్‌‌‌‌ బర్న్‌‌‌‌ ప్రాడక్ట్స్‌‌‌‌’కు పచ్చజెండా ఊపింది.

సమతుల చట్టాలుండాలి
పొగాకు, ఈఎన్‌‌‌‌డీఎస్‌‌‌‌ల వాడకం, ఎగుమతి, అమ్మకాలపై చట్టాలు సమతులంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పన్ను విధింపు, పొగాకు ఉత్పత్తుల వాడకానికి సంబంధించి ప్రజలకు మార్గదర్శకాలు, వయసు, సిగరెట్లు, ఈ–సిగరెట్లలో నికోటిన్‌‌‌‌ పరిమాణం తదితరాలపై సరైన నియమాలు ఉండాలంటున్నారు. దేశాలు దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులనూ తమ దేశంలో తయారైన వస్తువుల్లాగే చూడాలని వరల్డ్‌‌‌‌ ట్రేడ్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ (డబ్ల్యూటీవో) మార్గదర్శకాలిచ్చిందని, దీని వల్ల కూడా చాలా సమస్యలొస్తున్నాయని అంటున్నారు. ‘‘ఉత్పత్తుల భౌతిక ప్రమాణాలు, వాడకం, వినియోగదారుడికి వాటి గురించి ఎంత తెలుసు? ఏ పన్ను వర్గంలో ఆ ఉత్పత్తి ఉంది లాంటి 4 ప్రమాణాలు డబ్ల్యూటీవో సెట్‌‌‌‌ చేసింది. ఆ ప్రకారం ఈ–సిగరెట్లు కూడా సాధారణ సిగరెట్ల వర్గంలోకే వస్తాయి’’ అని అంటున్నారు.

ఇక్కడే ఎందుకు బ్యాన్‌‌?
ప్రస్తుతం ఈ సిగరెట్లు ఇండియాకు పెద్ద మొత్తంలో దిగుమతి అవుతున్నాయి. సాధారణ సిగరెట్లు ఇక్కడే ఎక్కువగా తయారవుతున్నాయి. ఇండియా ఇప్పటికే ఈఎన్‌‌డీఎస్‌‌లను బ్యాన్‌‌ చేయడంతో ఈ సిగరెట్ల మార్కెట్‌‌కు చెక్‌‌ పడ్డట్టయింది. దేశంలో పొగాకు ఉత్పత్తుల వల్ల రెండు శాతం ట్యాక్స్‌‌ రెవెన్యూ వస్తోంది. 70 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఈఎన్‌‌డీఎస్‌‌ల మార్కెట్‌‌ పెరిగితే రెవెన్యూ తగ్గుతుందని సర్కారు భావిస్తోంది. ఈ పన్నుల కోసం ప్రభుత్వాలు ఈ సిగరెట్లను బ్యాన్‌‌ చేయడం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సిగరెట్లు డేంజరన్న తప్పుడు సమాచారంతో వాటిని ప్రభుత్వం బ్యాన్‌‌ చేసిందని చెబుతున్నారు. ఈ సిగరెట్లు ప్రమాదం కాదని వాటి మార్కెట్‌‌కు పెద్ద పెద్ద దేశాలే ఓకే చేస్తున్నప్పుడు ఇక్కడెందుకు బ్యాన్‌‌ చేయాలని ప్రశ్నిస్తున్నారు.