కరోనా చాంపియన్‌‌కు మంత్రి పదవి ఇయ్యలె

కరోనా చాంపియన్‌‌కు మంత్రి పదవి ఇయ్యలె
  • కేరళ కేబినెట్‌లో సీఎం తప్ప అందరూ కొత్తవారే 
  • కేకే శైలజను కేబినెట్​లోకి తీసుకోని విజయన్​

తిరువనంతపురం: కేరళలో రెండోసారి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పినరయి విజయన్ కేబినెట్ కూర్పులో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతా కొత్త వారినే మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. గత టర్మ్​లో హెల్త్​ మినిస్టర్‌‌‌‌గా..​ నిఫా వైరస్ మొదలు కరోనా క్రైసిస్‌‌ను సమర్థవంతంగా హ్యాండిల్​ చేసి ఇతర రాష్ట్రాలకు కేరళను ఆదర్శంగా నిలిపి కరోనా చాంపియన్​గా గుర్తింపు పొందిన కేకే శైలజకు సైతం మంత్రి పదవి ఇవ్వకుండా దూరంగాపెట్టడం  అందరిని షాక్‌‌కు గురిచేసింది. ఆమెను కొత్త కేబినెట్‌‌లోకి తీసుకోకపోవడంపై ప్రతిపక్షాలు సైతం ఎల్డీఎఫ్​ సర్కార్​పై విమర్శలు చేస్తున్నాయి. శైలజ విషయంలో సీఎం విజయన్ నిర్ణయాన్ని కాంగ్రెస్​ లీడర్ శశిథరూర్​ తప్పుపట్టారు. ఆమెకున్న పేరు, సామర్థ్యాలను పక్కన పెడితే, హెల్త్​ మినిస్టర్​గా ఆమె పనితీరు అద్భుతం అని ట్విట్టర్​లో కొనియాడారు. ముఖ్యంగా కరోనా ఫస్ట్​ వేవ్​ను కట్టడి చేయడంలో శైలజా టీచర్​ కీలక పాత్ర పోషించడంతో ఆమె ‘రాక్​స్టార్’​ హెల్త్​ మినిస్టర్​గా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా గత సెప్టెంబర్​లో యూకేకు చెందిన ప్రాస్పెక్ట్​ మ్యాగజీన్​ కేకే శైలజాను ‘టాప్​ థింకర్​ ఆప్​ ది ఇయర్​-2020’గా సెలెక్ట్​ చేసింది. తాజా ఎన్నికల్లో ఆమె 60 వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు.

కొత్త ముఖాలు కావాలి.. అందుకే..
కేరళ సీఎం విజయన్​ మంగళవారం ఆ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం​లో జరిగిన సమావేశంలో పార్లమెంటరీ పార్టీ లీడర్​గా ఎన్నుకున్నట్లు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకత్వం ప్రకటించింది. పార్టీ సీనియర్​ లీడర్​ ఎలమారామ్​ కరీం అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌‌లో పార్టీ విప్​ పదవిని కేకే శైలజకు అప్పగించాలని నిర్ణయించారు. ‘సీఎం విజయన్​ తప్ప కేబినెట్​లో అందరూ కొత్తవారే. ఇది మా పార్టీ నిర్ణయం. అలా చేసే ధైర్యం ఒక్క మా పార్టీకే ఉంది. చాలా మంది సీనియర్​ లీడర్లనే ఈ ఎన్నికల్లో పోటీకి అనుమతించలేదు. మాకు కొత్త ముఖాలు కావాలి’ అని ఎమ్మెల్యే షంషీర్​ అన్నారు. సీఎం సహా 21 మందితో విజయన్​ కేబినెట్ ఏర్పాటు చేసి వారి పేర్లను ప్రకటించారు. సీపీఎం నుంచి మంత్రులుగా విజయన్ అల్లుడు మొహద్​ రియాస్, ఎంవీ గోవిందన్, కె.రాధాకృష్ణన్, కేఎన్​ బాలగోపాల్, పి.రాజీవ్, వీఎన్.వసాన్, సాజీ చెరియన్, వి.శివన్​కుట్టి, డాక్టర్​ఆర్.బింధు, వీణా జార్జ్, వి.అబ్దుల్​ రెహ్మాన్ ఉన్నారు.