భూమి పరిరక్షణ బాధ్యత అందరిది

భూమి పరిరక్షణ బాధ్యత అందరిది

సమస్త జీవకోటికి  జీవనాధారమైన భూమి జీవరాశుల భారాన్నంతటినీ సమానంగా మోస్తోంది. భూమిని రక్షించుకోవడం పట్ల పౌరుల్లో అవగాహన లేకుండా పోతోంది. ప్రత్యేక చర్యలు ఏమీ తీసుకోలేక పోయినా కనీసం ఈ నేలకు హాని కలిగించకుండా ఉంటే చాలు అన్న సామాజిక స్పృహ పౌర సమాజంలో పెరగాలి. భూమి పరిరక్షణ ద్వారా సహజ వనరుల లభ్యత పెరుగుతుంది. జీవకోటికి కావాల్సిన ఆహారం, గాలి, నీరు దొరుకుతాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పర్యావరణంతో పాటు భూమిని కాపాడుకుందాం.

పర్యావరణ రక్షణ భూమి సంరక్షణ.. వన్య ప్రాణుల రక్షణ పరస్పర ఆధారిత ప్రభావిత అంశాలు. పర్యావరణం ధరిత్రీ రక్షణ ఏక కాలంలో చేదోడు వాదోడుగా జరగాలి. ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చి  భూ పరిరక్షణ పై అవగాహన కోసం ప్రపంచ వ్యాప్తంగా తొలి ధరిత్రి దినోత్సవాన్ని 1970 ఏప్రిల్ 22న ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆధునీకరణ సాంకేతిక ఉత్పత్తి విధానాలు పారిశ్రామికీకరణ వల్ల భూమిపై ఉష్ణోగ్రత, వాతావరణ కాలుష్యంపెరిగి ప్రజారోగ్యానికి సవాల్​గా పరిణమించింది. పర్యావరణ పరిరక్షణ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు.. వాతావరణం కాలుష్య నివారణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని అమెరికన్ సెనటర్ గెరాల్డ్ నెల్సన్ ఏర్త్​ డేకు రూపకల్పన చేశారు.పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

తొలి ధరిత్రి దినోత్సవం ఈ నెల 22, 1970లో అమెరికా వీధుల్లో  వేలాది మంది పారిశ్రామిక విప్లవానికి వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. భూమ్మీద రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి సిద్ధమైన సరస్సులు, చెరువులు, కుంటలు‌ జలపాతాల విధ్వంసం పెరిగిపోయింది. శీఘ్రంగా పెరుగుతున్న పట్టణీకరణ.. వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా వాడుతున్న కొన్ని రకాల ఎరువులు, పురుగు మందులు భూమి సారాన్ని క్షీణింప చేయడం వల్ల భూమి సహజత్వాన్ని కోల్పోవడం భూమి కోతకు గురికావడం బీడు భూములుగా మారడం గమనార్హం. వాతావరణ కాలుష్యం వల్ల ‌ఆరోగ్య సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. గత కొన్ని లక్షల ఏండ్ల భూమి చరిత్రలో ఇప్పుడు నమోదు అవుతున్న అధిక ఉష్ణోగ్రతలే  అందుకు కారణం.

భూమిని దేవతగా ఆరాధిస్తారు..

భూమిని తల్లిగా, దేవతగా ఆరాధించే భారతీయులకు భూమికీ ఎంతో అవినాభావ సంబంధం వుంది. అంతేకాదు భారతీయులు భూమి కలిగి వుండడం సామాజిక హోదాగా కూడా భావిస్తారు. ప్రపంచంలో మిగతా దేశాల కంటే భారతీయులు భూమితో అనుబంధాన్ని పెంచుకుంటారు. మన సంస్కృతి భూ రక్షణ మీదే ఆధారపడి ఉంది. అందుకే పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి రక్షణే లక్ష్యంగా సమగ్ర ధరిత్రీ రక్షణ విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. అందుకు దోహదపడే చర్యలు చేపట్టాలి. దీనికోసం  ప్రతి వ్యక్తీ రోజు వారీ అలవాట్లలో కార్యక్రమాల్లో కొన్నింటిని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మాంసాహారానికి దూరంగా ఉండి తద్వారా కార్బన్ ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించేలా చూడాలి. పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగించాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి. పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్ బాటిల్స్, బ్యాగులనే వాడాలి. అవసరం లేనప్పుడు విద్యుత్ బల్బులను  వినియోగించకూడదు. స్థానికంగా దొరికే స్వదేశీ వస్తువులనే ఆహారంగా స్వీకరించాలి. సాధ్యమైనంత వరకు రీసైక్లింగ్ అవకాశం ఉన్న వస్తువులను ఉపయోగించాలి. డిస్పోజబుల్ ప్యాకేజీలకు దూరంగా ఉండాలి. భూ సంరక్షణ  పాఠశాల, కళాశాల స్థాయిలో పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టి ధరిత్రి రక్షణ పట్ల విద్యార్థులకు అవగాహన, చైతన్యం కల్పించాలి. చుట్టుపక్కల పరిసరాలు పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడం. పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛ భారత్​, హరిత వనాల పెంపకం..  సామాజిక అడవుల పెంపకం ఉద్యమంగా సాగాలి.

భూమి సహజత్వాన్ని రక్షించే ప్రకృతి వ్యవసాయం సహజ వ్యవసాయ విధానాలను అమలు చెయ్యాలి . మానవాళి పురోగమనానికి.. ప్రగతికి తోడ్పడాలి. ధరిత్రీ రక్షణలో  పౌర సమాజం, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ధరిత్రి రక్షణలోక్రియాశీలక పాత్ర పోషించాలి. సమాజంలో ధరిత్రి రక్షణ స్పృహ ను స్ఫూర్తిని పెంచాలి. ‘‘ రండి మన భూమిని కాపాడుకుందాం” భూమికి  ప్రత్యామ్నాయం లేదు  ధరిత్రి రక్షణ పౌర సమాజం సామాజిక బాధ్యతగా గుర్తెరిగి మసలుకుందాం.

వినాశనం వైపే పడుతున్న అడుగులు..

420 కోట్ల ఏండ్ల భూగోళం గత 300 ఏండ్లలో  గుడ్డిగా అభివృద్ధి పేరుతో చేసిన బీభత్సం కారణంగా రాబోయే  80 ఏండ్లలో భూమి బూడిద కాబోతుంది. ఈ భూమ్మీద ఉన్న సమస్త మానవ జాతి అంతరించే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. 2100 కల్లా  భూమ్మీద మానవుడు బతికి బట్ట కట్టలేని దుస్థితి వస్తుందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. మానవులు, పరిశ్రమలు చేసే కాలుష్యం వల్ల గ్లోబల్​ వార్మింగ్​ పెరిగి పోతోంది. సమస్త భూగోళం వినాశనం దిశగా అడుగులు వేస్తోంది. మన వారసులకు సిరి సంపదలు, ఆహ్లాదకరమైన భూమిని కాకుండా కలుషితమైన వాతావరణాన్ని వారసత్వ ఆస్తిగా ఇవ్వబోతున్న దుస్థితి నెలకొనడం శోచనీయం.
- నేదునూరి కనకయ్య, అధ్యక్షులు తెలంగాణ 
ఎకనామిక్ ఫోరం.