ధోని అత్యుత్తమ కెప్టెన్ మాత్రమే.. రోహిత్ శర్మ మంచి మనసున్న నాయకుడు: అశ్విన్

ధోని అత్యుత్తమ కెప్టెన్ మాత్రమే.. రోహిత్ శర్మ మంచి మనసున్న నాయకుడు: అశ్విన్

సొంతగడ్డపై భారత జట్టు వన్డే వరల్డ్ కప్ 2023ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. టోర్నీ అసాంతం అద్భుతంగా రాణించిన రోహిత్ సేన ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను అందరూ విమర్శించారు. ఫైనల్‌లో అతని డిఫెన్సివ్ కెప్టెన్సీయే ఓటమికి కారణమని నిందలు మోపారు. ఐపీఎల్‌లో నువ్ గొప్ప కెప్టెన్ వి కావచ్చేమో కానీ, ఐసీసీ టోర్నీల్లో భారత మాజీ సారథి ఎంఎస్ ధోనితో నువ్ సరితూగలేవంటూ నోటికొచ్చింది వాగారు. ఈ విమర్శలపై భారత వెటరన్ స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ నోరు విప్పారు. 

రోహిత్‌ను కెప్టెన్‌గా, క్రికెటర్‌గా, ఒక మంచి మనుసున్న వ్యక్తిగా వర్ణించిన అశ్విన్ ఆటగాళ్ల ఇష్టాఇష్టాలు తెలుకోవడంలో హిట్‌మ్యాన్.. ధోని కంటే ఒక మెట్టు ఎక్కువేనని చెప్పుకొచ్చారు. 

"మీరు భారత క్రికెట్‌ను పరిశీలిస్తే, ఎంఎస్ ధోని అత్యుత్తమ కెప్టెన్ అని అందరూ మీకు చెబుతారు. కానీ, రోహిత్ శర్మ అత్యుత్తమమైన వ్యక్తి. అతను జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని అర్థం చేసుకుంటాడు. అతనికి జట్టులోని ప్రతి ఒక్కరి ఇష్టాలు మరియు అయిష్టాలు తెలుసు. అన్నిటిపై గొప్ప అవగాహన ఉంటుంది. అతను ప్రతి ఆటగాడిని వ్యక్తిగతంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.." అని అశ్విన్ భారత మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్‌తో కలిసి తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు.

ధోని vs రోహిత్

వీరిద్దరిలో తమ అభిమాన నాయకుడే గొప్పని వారి వారి ఫ్యాన్స్ తన్నుకోవడం కొత్తేమి కాదు. అందుకు ఐపీఎల్ విజయాలను వారు ఉదారణగా చూపుతుంటారు. హిట్‌మ్యాన్ ఐదు సార్లు ముంబై ఇండియన్స్ విజేతగా నిలపాడని రోహిత్ అభిమానులు వాదిస్తే, తమ తాలా కూడా ఐదు సార్లు చెన్నై జట్టును విజేతగా నిలిపాడని మహేంద్రుడి అభిమానులు బదులిస్తుంటారు. కాగా, ధోని సారథ్యంలో భారత జట్టు మూడు సార్లు ఐసీసీ ట్రోఫీ(2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ)ని సొంతం చేసుకుంది.