నిర్మల్ జిల్లా అడెల్లి జాతరకు వేళాయే..

 నిర్మల్ జిల్లా అడెల్లి జాతరకు వేళాయే..
  • ఏటా వైభవంగా ఉత్సవాలు
  • ఈ నెల 28న గంగనీళ్ల జాతర
  • ఆదాయం పెరుగుతున్నా సౌకర్యాల కరువు

సారంగాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా సారంగా పూర్ మండలం అడెల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అడెల్లి పోచమ్మ తల్లి గంగ నీళ్ల జాతరకు సర్వం సిద్ధమైంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అడెల్లి మహా పోచమ్మ ఆలయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఏటా దసరాకు ముందు వచ్చే అమావాస్య తర్వాత శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు గంగనీళ్ల జాతర నిర్వహిస్తారు. 

ఈ నేపథ్యంలోనే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అమ్మవారి ఆభరణాలతో ఆలయం నుంచి శనివారం ఉదయం ప్రారంభమయ్యే భక్తుల పాదయాత్ర అడెల్లి, సారంగాపూర్, యాకరపల్లి, వంజర్, ప్యారమూర్, మాడేగాం, దిలావర్ పూర్, బనవెల్లి, కంజర్, మల్లాపూర్ గ్రామాల మీదుగా సాంగ్వి గ్రామం లోని గోదావరి నది తీరానికి చేరుకుంటుంది. 

రాత్రి అక్కడ బసచేస్తారు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు నదిలో అమ్మవారి అభరణాలను శుద్ధి చేసి తిరిగి ప్రయాణమవుతారు. భాజా భజంత్రీల నడుమ ఆలయానికి చేరుకుంటారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

బాలాలయంలోనే అమ్మవారి ఉత్సవాలు 

2013లో ప్రారంభమైన ఆలయ పునఃనిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్టోబర్ చివరి వారంలో పనులు ముగియనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. ఆలయ పునఃనిర్మాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో జాతర ఉత్సవాలు స్థానిక బాలాలయంలోనే జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం నిర్మల్, భైంసా డిపోల నుంచి అడెల్లి దేవాలయం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించనుంది. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

సౌకర్యాల కరువు

సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ప్రత్యేక వాహనాల్లో వస్తుంటారు. వాహనాల పార్కింగ్​కు అనువైన ప్రదేశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టాయిలెట్స్​లేక ఇబ్బంది పడుతున్నారు. ఆలయానికి వివిధ రూపాల్లో ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాలను ఏర్పాటుచేయడంలో ఆలయ కమిటీ విఫలమవుతోందని ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అన్ని సౌకర్యాలు కల్పించా లని భక్తులు కోరుతున్నారు.