ఈవీఎంలను డీఆర్సీలకు తరలించాలి: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు

ఈవీఎంలను డీఆర్సీలకు తరలించాలి: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లకు(డీఆర్సీ) జాగ్రత్తగా చేర్చాలని హైదరాబాద్ జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం చాదర్ ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ లోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్​ను ఆయన సందర్శించారు. ర్యాండమైజేషన్ ద్వారా జిల్లాలోని 15 సెగ్మెంట్లకు కేటాయించిన ఈవీఎంలను పరిశీలించారు. 

వాటి రవాణాపై ఎన్నికల అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈవీఎంలు చేరవేసే వెహికల్స్​కు పటిష్ట భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికలు జరిగే సమయంలో ఓటర్లతో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఓటింగ్ మెషీన్లను ముందే పరీక్షించి భద్రపరచుకోవాలని అనుదీప్ దురిశెట్టి సూచించారు.

రంగారెడ్డి జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్​లకు ఈవీఎంలు

రాజేంద్రనగర్​లోని ఈవీఎం గోడౌన్ నుంచి రంగా రెడ్డి జిల్లాలోని 8 సెగ్మెంట్లకు భారీ బందోబస్తు నడుమ ఈవీఎంలను తరలించారు.  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళీకేరి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పర్యవేక్షణలో.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలను సెగ్మెంట్లలోని స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు.  

షాద్ నగర్ సెగ్మెంట్ పరిధిలో 252 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. ఎన్నికల కోసం 310 ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు ఆర్డీవో వెంకట మాధవరావు తెలిపారు.