ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా సుదర్శన్ రెడ్డి : తెలంగాణ వ్యక్తిని బరిలోకి దించిన పార్టీలు

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా సుదర్శన్ రెడ్డి : తెలంగాణ వ్యక్తిని బరిలోకి దించిన పార్టీలు

ఉప రాష్ట్రపతికి పోటీ ఖాయం అయ్యింది. ఏకగ్రీవం కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని ఎత్తుగడ వేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బి. సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే. 2025, ఆగస్ట్ 19వ తేదీన ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశంలో సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా అమోదించాయి పార్టీలు.

బి.సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ జడ్జిగా రిటైర్ అయ్యారు. 2007 జనవరి 12 నుంచి 2011 జూలై 8వ తేదీ వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు బి.సుదర్శన్ రెడ్డి. ఆ తర్వాత గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ గా విధులు నిర్వహించారు. 2013లో వ్యక్తిగత కారణాలతో ఆ పదవికి రాజీనామా చేశారాయన.

1946 జూలై 8 జన్మించిన బి. సుదర్శన్ రెడ్డిది తెలంగాణ రాష్ట్రం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆకుల మైలారం గ్రామంలో జన్మించారాయన. 1971లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ తీసుకున్న తర్వాత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేశారు. సివిల్, రాజ్యాంగ విషయాలపై ప్రాక్టీస్ చేశారు. 1988లో హైకోర్టులో ప్రభుత్వ లాయర్ గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సెల్ లో సభ్యుడిగా వ్యవహరించారు సుదర్శన్ రెడ్డి. 1993లో హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీకి న్యాయ సలహాదారుగా కూడా పని చేశారాయన. 1993లో ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు.
2005లో గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎంపిక అయ్యారు. అక్కడి నుంచి 2007లో సుప్రీంకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.

ఇద్దరూ దక్షిణాది అభ్యర్థుల మధ్య పోటీ:

ఒకవైపు ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ను ప్రతిపాదించింది.  అయితే ఆరెస్సెస్ బ్యాగ్రౌండ్ లేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆలోచిస్తామని తేల్చి చెప్పాయి ఇండియా కూటమి పార్టీలు. దీనిపై ఎన్డీఏ కూటమి తగ్గక పోవడంతో ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిగా తెలంగాణకు చెందిన బి.సుదర్శన్ రెడ్డిని ప్రకటించాయి. ఉపరాష్ట్రపతి అభర్థులుగా ఇద్దరూ దక్షణాది అభ్యర్థులే పోటీ పడుతుండటం విశేషం.