బెట్టింగ్, షేర్ మార్కెట్ నష్టాలతో.. దొంగగా మారిన మాజీ సైనికుడు

 బెట్టింగ్, షేర్ మార్కెట్ నష్టాలతో.. దొంగగా మారిన మాజీ సైనికుడు
  • అప్పుల బాధతో రైళ్లలో చైన్ స్నాచింగ్స్ 
  • అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు
  • రూ. 7.50 లక్షల విలువైన 50 గ్రాముల బంగారం స్వాధీనం 

పద్మారావునగర్, వెలుగు: భారత సైన్యంలో 30 ఏండ్ల పాటు సుబేదార్​గా సేవలందించి రిటైరైన ఓ మాజీ సైనికుడు దురలవాట్ల కారణంగా దొంగగా మారాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి (51) ఆర్మీ నుంచి 2024లో పదవీ విరమణ పొంది ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలోని నాగారంలో నివసిస్తున్నారు. షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో నష్టపోవడం, ఆన్​లైన్ బెట్టింగ్​లకు బానిస కావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించేందుకు నేరాల బాట పట్టాడు. 

వరుసగా రెండు చోరీలు..

ఈ నెల 2న కాకతీయ ఎక్స్​ప్రెస్​లో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి గొలుసు లాగడానికి ప్రయత్నించగా, ఆమె గట్టిగా పట్టుకోవడంతో గొలుసు తెగి సగం భాగం (15 గ్రాములు) శ్రీనివాస్ రెడ్డి చేతికి చిక్కింది. వెంటనే లాలాగూడ స్టీల్ బ్రిడ్జి వద్ద నెమ్మదిగా వెళ్తున్న రైలు నుంచి దూకి తప్పించుకున్నాడు. సరిగ్గా మరుసటి రోజు (ఏప్రిల్ 3) మళ్లీ అదే కాకతీయ ఎక్స్​ప్రెస్​లో మరో మహిళా ప్రయాణికురాలి బంగారు గొలుసును తెంచుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి దూకేశాడు.

గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లోని 4వ నంబర్ ప్లాట్​ఫారమ్​పై అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీనివాస్ రెడ్డిని సికింద్రాబాద్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన నేరాలను అంగీకరించడంతో అతని నుంచి రూ. 7.50 లక్షల విలువైన 50 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఇన్​స్పెక్టర్ బి. సాయిఈశ్వర్ గౌడ్, ఎస్సైలు సుబ్బారెడ్డి, మాధవ్, ఆర్పీఎఫ్ బృందాన్ని రైల్వే ఎస్పీ సందీప్ అభినందించగా, ఐజీ రమేశ్ నాయుడు రివార్డులు ప్రకటించారు.